ఆమె ఇక్కడే ఉరేసుకుంది; వణికిపోతున్న మహిళా ఖైదీలు!

3 Aug, 2019 08:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : అక్కడ ఉన్న వాళ్లంతా మహిళలే. వివిధ నేరాల్లో పడిన శిక్ష కారణంగా నాలుగు గోడల మధ్య బంధీలుగా ఉన్నారు. అయితే గతంలో ఎన్నడూ లేనిది వాళ్లంతా భయంతో వణికిపోతున్నారు. అర్ధరాత్రి దాటితే చాలు గుండె చిక్కబట్టుకుని కూర్చుంటున్నారు. దూరంగా వినిపిస్తున్న ఏడుపులు, ఆర్తనాదాలు.. తెల్లగా కదలాడే ఆకారం వాళ్లను నిద్రపోనివ్వడం లేదు. చాలా రోజులుగా ఇదే తంతు. ఇదంతా చదువుతుంటే హారర్‌ స్టోరీలా అనిపిస్తుంది కదా. అయితే ఇదేమీ కథ కాదు.. నమ్మలేని నిజం అంటున్నారు దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీలు. అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల ప్రాంతంలో బ్యారక్‌ నంబరు 6 నుంచి అదే పనిగా ఏడుపు వినిపిస్తోందని భయంతో బెంబేలెత్తిపోతున్నారు. గతంలో ఆ బ్యారక్‌లో ఓ మహిళా ఖైదీ ఉరేసుకుందని, ప్రస్తుతం ఆమె ఆత్మ అక్కడే సంచరిస్తుందని వణికిపోతున్నారు.

ఈ క్రమంలో ‘దెయ్యం’ విషయం గురించి తమలో తాము చర్చించుకుంటే లాభం లేదనుకుని జైలు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ రహస్యాన్ని ఛేదించి తమకు మానసిక ప్రశాంతత చేకూర్చాలని వేడుకుంటున్నారు. కాగా మహిళా ఖైదీల ఆరోపణలపై జైలు అధికారులు ఇంతవరకు స్పందించలేదు. ఇక ఈ విషయంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక కాలంలో ఇలాంటి కట్టుకథలు ఎవరూ నమ్మరు అని కొం‍తమంది కొట్టిపారేస్తుండగా.. మరికొంత మంది మాత్రం ఆత్మల సంచారం ఉంటుందంటూ పలు సంఘటనలను ఉదాహరణగా పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు