వీర వనిత

9 Mar, 2020 07:29 IST|Sakshi
ప్రభుత్వ బస్సు సీటు కింద రంధ్రం, కుమారుడు పాండితో ఉష

బస్సు రంధ్రంలో చిక్కుకున్న కుమారుడిని కాపాడుకున్న మహిళ

సమస్య పరిష్కరించాలని ధర్నా

ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ప్రశంసలు

దిండుగల్‌ సమీపంలోఓ మహిళ ప్రభుత్వ రవాణాశాఖ అధికారుల్లో కదలికవచ్చే వరకూ పోరాడింది. తన కుమారుడిలా ఎవరూ బాధ పడకూడదని, సమస్యనుపరిష్కరించే వరకూ కదిలేదని లేదని పట్టుపట్టి కూర్చుంది.ఎట్టకేలకు స్పందించిన అధికారులు సమస్యనుపరిష్కరించారు..

సాక్షి, చెన్నై: దిండుగల్‌ నందవనపట్టికి చెందిన ఉషా శనివారం తన మూడేళ్ల కుమారుడు పాండితో వత్సలగుండు వెళ్లేందుకు తేని వెళ్లే బస్సులో ఎక్కింది. ఇరువురూ డ్రైవర్‌ వెనుక సీట్లో కూర్చున్నారు. దిండుగల్‌ సమీపంలో బస్సు వెళ్తుండగా కుమారుడు పాండి కుడి కాలు సీటు కింద ఉన్న రంధ్రంలో చిక్కుకుంది. దీంతో అప్రమత్తమైన ఆమె కుమారుడు పడిపోకుండా గట్టిగా పట్టుకుంది. కాలుకు గాయం ఏర్పడకుండా మెల్లిగా పైకితీసింది. తర్వాత కండక్టర్‌ ఇరువురిని వేరొక సీట్లో కూర్చోబెట్టారు. దీని గురించి ఉషా తన సెల్‌ఫోన్‌లో దిండుగల్‌ రవాణా సంస్థ మేనేజర్‌ పుహలేందికి ఫిర్యాదు చేసింది. రంధ్రాన్ని వెంటనే పూడ్చివేయాలని కోరింది.

అయితే అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో బస్సు వత్సలగుండు చేరుకోగానే బస్సు నుంచి దిగనంటూ బిడ్డతో పాటు బైఠాయించింది. బస్సును అక్కడి నుంచి బయలుదేరనీయకుండా డిపోకు తీసుకువెళ్లాలని పట్టుపట్టింది. దీంతో దిక్కుతోచని కండక్టర్, డ్రైవర్‌ బస్సులో ఉన్న ప్రయాణీకులందరిని దింపివేసి వేరొక బస్సులో పంపారు. బస్సును వత్సలగుండు డిపోకు తీసుకువెళ్లారు. అదే బస్సులో ఉషా కూడా వెళ్లింది. అక్కడ డిపో మేనేజర్‌ నాగపాండియన్‌ ఉషాకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వారి సమాధానంతో తృప్తి చెందని ఆమె తన పోరాటాన్ని కొనసాగించింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో దిండుగల్‌ నుంచి రవాణా సంస్థ మేనేజర్‌ పుహలేందన్‌ వత్సలగుండు చేరుకున్నారు. బస్సులో ఉన్న రంధ్రాన్ని పూడ్చివేయాలని సిబ్బందికి ఉత్తర్వులిచ్చారు. ఉషా సమక్షంలో రంధ్రాన్ని సిబ్బంది పూడ్చివేశారు. బస్సులో మిగతా లోపాలను సరిచేశారు. ఆ తర్వాత ఉషా అక్కడి నుంచి బయలుదేరి వెళ్లింది.

ఉషకు ప్రజల ప్రశంసలు
అధికారులతో ఒంటరిగా పోరాడి పని సాధించుకున్న ఉషాకు ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. సోషల్‌ మీడియాలోను ఆమె చర్యను పలువురు అభినందిస్తున్నారు. దీని గురించి ఉషా మాట్లాడుతూ ప్రభుత్వ బస్సు రంధ్రాలలో పడి ప్రాణాపాయం ఏర్పడుతున్న సంఘటనలు జరుగుతున్నాయని, అయినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అదృష్టవశాత్తు తన కుమారుడిని కాపాడుకోగలిగానన్నారు. వేరెవరికీ ఇటువంటి ప్రమాదం జరగకూడదని తాను పోరాడినట్లు పేర్కొన్నారు. బస్సులకు మరమ్మతులు నిర్వహించాలని ఆమె అధికారులను కోరారు. (నటుడి తమ్ముడి ఆత్మహత్య.. కేసులో కొత్త కోణం)

>
మరిన్ని వార్తలు