లైంగిక హింస.. మహిళనూ వదలొద్దు!

12 Jan, 2018 11:10 IST|Sakshi

అత్యున్నత న్యాయస్థానంలో పిల్‌ దాఖలు

‘ఐపీసీ 497పై పునఃసమీక్ష’ నేపథ్యంలో మరో వ్యాజ్యం

సాక్షి, న్యూఢిల్లీ : అత్యాచారం, లైంగిక వేధింపులు, వెంటాడటం, ఇతరుల శృంగార కార్యకలాపాలను చూసి ఆనందించడం.. తదితర నేరాలలో మహిళలకు కూడా శిక్షలు విధించాలనే వాదన మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవలికాలంలో లైంగిక హింసను ఎదుర్కొంటున్న పురుషల సంఖ్య పెరిగిపోతున్నందున.. మహిళలకు శిక్ష పడకుండా అడ్డుగా ఉన్న మినహాయింపులను రద్దుచేయాలని, ఆ మేరకు చట్టాల్లో సవరణలు చేయాలని అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలైంది. ఇప్పటికే ఎన్నో పిల్స్‌లో విజయం సాధించిన ప్రముఖ లాయర్‌ రిషి మల్హోత్రానే దీనిని దాఖలు చేశారు.

‘‘భారతదేశంలో ప్రతి 222 మంది పురుషుల్లో 16.1శాతం మంది బలాత్కారానికి గురవుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఇప్పటికిప్పుడు ఒక మగవాడు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదుచేస్తే కేసు నమోదుకాని పరిస్థితి. ఎందుకంటే 158 ఏళ్ల కిందట బ్రిటిష్‌ కాలంలో రూపుదిద్దుకున్న చట్టాల ప్రకారం అత్యాచారం, లైంగిక వేధింపులు, వెంటాడటం, ఇతరుల శృంగార కార్యకలాపాలను చూసి ఆనందించడం తదితర నేరాలలో మహిళను నిందితురాలిగా గుర్తించరు. కేవలం బాధితురాలిగానే గుర్తిస్తారు. నిజానికి నేరాలకు లైంగికబేధం ఉండదు కానీ చట్టాలు మాత్రం ఇంకా ఆ బేధాన్ని కొనసాగించేలా ఉన్నాయి. అందుకే వాటిని మార్చాల్సిన అవసరం ఉంది. ఐపీసీలోని సెక్షన్‌ 497పై ఇటీవల సుప్రీంకోర్టు పునఃసమీక్ష జరిపిన నేపథ్యం కూడా తెలిసిందే’’ అని లాయర్‌ రిషి మల్హోత్రా తన పిల్‌లో పేర్కొన్నారు.

వివాహేతర సంబంధాల్లో మహిళల తప్పెంత? : గత ఏడాది డిసెంబర్‌లో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అడల్టరీ అంశంపై విస్తృత స్థాయిలో విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. వివాహేతర సంబంధాల విషయంలో మహిళల భాగస్వామ్యం ఉన్నప్పటికీ పురుషులకు మాత్రమే శిక్షలు పడుతున్నాయన్న వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. దీనికి సంబంధించిన చట్టాన్ని పరిశీలించాలని, ఆ మేరకు విధానాన్ని తెలపాలని ప్రభుత్వాన్ని కోరింది. ట్రిపుల్‌ తలాక్‌ సవరణ బిల్లు విషయంలో ఆసక్తికనబర్చిన సర్కారు.. సెక్షన్‌ 497 సవరణలపై మాత్రం నిరాసక్తత ప్రదర్శిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు