రాజ్యాంగ రాణులు

26 Jan, 2020 04:46 IST|Sakshi

అది 1946 సంవత్సరం, డిసెంబర్‌ 9వ తేదీ. న్యూఢిల్లీలోని రఫీమార్గ్‌లో రాజ్యాంగ హాలులో దేశవ్యాప్తంగా మేథోవర్గానికి చెందిన వారు, రాజకీయ నేతలు హాజరయ్యారు. రాజ్యాంగ సభ తాత్కాలిక చైర్మన్‌ సచ్చిదానంద సిన్హా ఆధ్వర్యంలోని ఈ తొలి సమావేశానికి 192 మంది పురుషులు, 15 మంది మహిళలు హాజరయ్యారు. గత 70 ఏళ్లుగా మన ప్రజాస్వామ్య వ్యవస్థకే దిక్సూచిగా మారిన రాజ్యాంగ రచనకు పునాదులు పడిన సమయంలో 15 మంది మహిళలు కీలక భూమిక పోషించారు. రాజ్యాంగ సభ ఏర్పాటులో దేశంలో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యమివ్వాలని భావించారు కానీ మహిళల ప్రాతినిధ్యం తక్కువగానే ఉంది. రాజ్యాంగ సభలోని  మహిళలంతా అగ్రకులాలు, సంపన్నవర్గాలు, అధిక విద్యావంతులే ఉన్నారు.

ఒక ముస్లిం, ఒక దళిత మహిళకు మాత్రమే రాజ్యాంగ సభలో చోటు లభించింది. సరోజినీ నాయుడు, విజయలక్ష్మి పండిట్, సుచేతా కృపలాని, దుర్గాభాయ్‌ దేశ్‌ముఖ్‌ వంటి ప్రముఖులతో పాటు హంస మెహతా, రేణుక రే, నీరజ గోపాల్‌ వంటి వారూ ఉన్నారు. రాజ్యాంగ ముసాయిదాలో మహిళా హక్కులు, భద్రత ప్రముఖంగా ఉండాలని వీరంతా పోరాటం చేశారు. వీరిలో దాక్షాయణి అనే దళిత మహిళ అందరి కంటే వయసులో చిన్న. ఆమె వయసు అప్పటికి 34 ఏళ్లు. కేరళలో అణచివేతకు గురైన పులయా కులానికి చెందిన దాక్షాయణి.. భారత్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన తొలి దళిత మహిళగా రికార్డు సృష్టించారు.

మహిళల రక్షణ కోసం తీసుకునే చర్యల కోసం దాక్షాయణి రాజ్యాంగ సభలో పెద్ద పోరాటమే చేశారని ఆమె కుమార్తె మీరా చెబుతుంటారు. రాజ్యాంగానికి మెరుగులు దిద్దే క్రమంలో దాక్షాయణి రాజ్యాంగ సభలో చేసిన ప్రసంగాలే 1948 నవంబర్‌లో అంటరానితనాన్ని నిషేధించాయి. మరో ముస్లిం మహిళ రసూల్‌..ముస్లిం లీగ్‌ను వీడి ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌లోకి వచ్చారు. మైనారిటీ హక్కులపై  పోరాటం చేశారు. ముస్లింలకు ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్లు వచ్చాయి. కానీ వాటిని వదులుకోవడానికి కృషి చేశారు. చివరికి వెనుకబడిన కులాలకే రిజర్వేషన్లు కల్పించడానికి సభ అంగీకరించింది.

మరిన్ని వార్తలు