హిమాచల్‌ ఓటింగ్‌లో మహిళలే టాప్‌!

12 Nov, 2017 03:27 IST|Sakshi

సిమ్లా: ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పురుషులతో పోల్చుకుంటే మహిళలే ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నవంబర్‌ 9న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 74.61% పోలింగ్‌ నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 18,11,061 మంది పురుషులు ఓటు వేయగా, 19,10,582 మంది స్త్రీలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

రాష్ట్రంలోని ఓటర్లలో స్త్రీల కంటే పురుషులు 72 వేల మంది అధికంగా ఉన్నప్పటికీ ఈ గణాంకాలు నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలోని మొత్తం 68 స్థానాలకుగానూ కేవలం 15 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నప్పటికీ..దాదాపు 48 నియోజకవర్గాల్లో మహిళల పోలింగ్‌ శాతం పురుషుల కంటే అధికంగా నమోదైంది. హిమాచల్‌ప్రదేశ్‌లోనే అతిపెద్ద జిల్లా అయిన కంగ్రాలో 4.61 లక్షల మంది మహిళలు, 3.96 లక్షల మంది పురుషులు ఓటువేశారు. 

>
మరిన్ని వార్తలు