రేపిస్టులను కాల్చివేసేందుకు వెనుకాడను!

5 Jan, 2016 09:52 IST|Sakshi
రేపిస్టులను కాల్చివేసేందుకు వెనుకాడను!

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ రేపిస్టుల విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం అనుమతిస్తే మహిళలపై నేరాలకు ఒడిగట్టే వారిని సంఘటన స్థలంలోనే కాల్చిపారేస్తామని, ఈ విషయంలో పోలీసులు ఏమాత్రం సంకోచించరని ఆయన పేర్కొన్నారు. అయితే, మన రాజ్యాంగం అలాంటి వాటిని అనుమతించదని, అందుకే పోలీసులు ప్రతి వ్యక్తి మానవహక్కులను గౌరవిస్తూ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నారని వెంటనే ఆయన వివరణ ఇచ్చారు. 'భారత రాజ్యాంగం అనుమతించి ఉంటే ఢిల్లీ పోలీసులు సంఘటన స్థలంలోనే మహిళలపై నేరాలకు పాల్పడిన వారిని కాల్చివేయడమో, ఉరి తీయడమో చేసేవారు. అయినప్పటికీ మేం మానవహక్కులకు కట్టుబడి ఉన్నాం. వాటిని గౌరవిస్తాం' అని బస్సీ చెప్పారు.

దేశ రాజధానిలో మహిళలపై జరుగుతున్న నేరాలకు కారణం లింగ నిష్పత్తిలో భారీ అగాథం ఉండటమే. ప్రస్తుతం వెయ్యి మంది పురుషులకు 600 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. మరోవైపు కొందరు మగవాళ్లు మహిళలను తమ తల్లిగానో, చెల్లిగానో, కూతురిగానో, భార్యగానో చూడకుండా కేవలం సరుకుగా భావిస్తున్నారు. అందువల్లే 21 ఏళ్ల యువకుడు 80 ఏళ్ల మహిళ లేదా ఐదేళ్ల బాలిక మీద అత్యాచారానికి పాల్పడుతున్నాడు' అని బస్సీ పేర్కొన్నాడు.

మహిళల భద్రతకు ఢిల్లీ పోలీసులు శాయశక్తుల కృషి చేస్తున్నారన్న బస్సీ.. అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ పై పరోక్ష విమర్శలు చేశారు. పోలీసులు కేజ్రీవాల్ సర్కార్ పరిధిలో లేకపోవడం తమ అదృష్టమని చెప్పారు. కేజ్రీవాల్ ప్రభుత్వం అధీనంలో ఉండి ఉంటే ఆయన 'స్థానిక ప్రయోజనాల' కారణంగా తమపై రాజకీయ ఒత్తిడి ఉండేదని, ప్రధానమంత్రి, హోంమంత్రికి అలాంటి ఉద్దేశం లేకపోవడం వల్ల తాము స్వేచ్ఛగా పనిచేస్తున్నామని బస్సీ అన్నారు.
 

మరిన్ని వార్తలు