'బస్సులో వెళ్లేందుకైనా అభ్యంతరం లేదు'

7 Dec, 2015 10:47 IST|Sakshi
'బస్సులో వెళ్లేందుకైనా అభ్యంతరం లేదు'

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్నినివారించడంలో సహకరించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా సిద్ధంగా ఉన్నారని, అవసరమైతే కోర్టుకు బస్సులో వెళ్లేందుకు తనకు అభ్యంతరమేమి లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ తెలిపారు. వాయు కాలుష్య నివారణకు జనవరి 1 నుంచి ఢిల్లీ ప్రభుత్వం అమలుచేయనున్న సరి-బేసి నెంబర్ ప్లేట్ ప్రణాళికకు ఆయన మద్దతు తెలిపారు. ఈ ప్రణాళిక ప్రకారం సరి-బేసి సంఖ్య నెంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలను దినం తప్పించి దినం రోడ్ల మీదకు అనుమతించనున్నారు.

ఈ నేపథ్యంలో మోతిలాల్ నెహ్రూ మార్గ్ లో ఉన్న తన నివాసం నుంచి నడుచుకుంటూ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకైనా, లేదా బస్సులో వెళ్లేందుకైనా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని జస్టిస్ ఠాకూర్ చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ సహచర న్యాయమూర్తులతో కలిసి కార్లను పంచుకుంటే.. ఈ విషయంలో సామాన్య ప్రజలకు కూడా సందేశం ఇచ్చినట్టు ఉంటుందని ఆయన చెప్పారు. కోర్టుకు వెళ్లేందుకు 'నడుచుకుంటూ వెళ్తాం లేదా బస్సు ఎక్కుతాం' అని ఆయన పేర్కొన్నారు. తమ పథకానికి మద్దతుగా వ్యాఖ్యలు చేయడంతో జస్టిస్ టీఎస్ ఠాకూర్ కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీఆల్ కృతజ్ఞతలు తెలిపారు.
 

మరిన్ని వార్తలు