కేంద్ర ఉద్యోగులకూ వర్క్‌ ఫ్రమ్‌ హోం

20 Mar, 2020 04:01 IST|Sakshi
కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోవడంతో తిరిగి వెళ్లిపోతున్న వైద్య సిబ్బందికి వూహాన్‌ ఎయిర్‌పోర్టులో ఘనంగా వీడ్కోలు చెబుతున్న నగర ప్రజలు, సైనికులు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కట్టడే లక్ష్యంగా భారత ప్రభుత్వ సంస్థలు, వేర్వేరు మంత్రిత్వ శాఖలు మరిన్ని చర్యలకు శ్రీకారం చుట్టాయి. ప్రజలు గుమికూడేందుకు ఉన్న అన్ని అవకాశాలను వీలైనంత వరకూ తగ్గించే దిశగా పలు చర్యలు చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మంది ఇంటి నుంచే పని చేయవచ్చునని ఆదేశించడం మాత్రమే కాకుండా... రైలు ప్రయాణాలను తగ్గించేందుకు రైల్వే శాఖ రోగులకు మినహా మిగిలిన వారందరికీ రాయితీలు తొలగించగా, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ అన్ని రకాల పరీక్షలను ఈ నెలాఖరు వరకూ వాయిదా వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. వైరస్‌ తీవ్రత దృష్ట్యా పదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి ఐసీఎస్‌ఈ బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ‘ద కౌన్సిల్‌ ఫర్‌ ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌’ప్రకటించింది.

సగం మంది ఇంటి నుంచే..
కోవిడ్‌ విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే దేశంలోని పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా ఆదేశించగా కేంద్ర ప్రభుత్వం గురువారం నుంచి సగం మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయవచ్చునని ప్రకటించింది. మిగిలిన సగం మంది మాత్రం ఆఫీసులకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వైరస్‌ కట్టడి చర్యల్లో భాగంగా ఉద్యోగులకు వేర్వేరు పనిగంటలను కేటాయించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. సిబ్బంది మంత్రిత్వ శాఖ విభాగాధిపతులకు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఆఫీసుల్లో కనీసం యాభై శాతం మంది గ్రూప్‌ బీ, సీ ఉద్యోగులు కచ్చితంగా ఉండాలి.

మిగిలిన వారు ఇంటి నుంచి పనిచేయవచ్చు. ఈ రెండు వర్గాల ఉద్యోగులు వారానికి ఒకసారి ఎక్కడి నుంచి పనిచేస్తారన్నది మార్చుకుంటారు. తొలి వారం ఎవరు ఆఫీసుకు రావాలన్న అంశంలో ఆఫీసుకు దగ్గరగా ఉన్న వారు...సొంత వాహనాలు వాడేవారికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఉద్యోగులందరినీ మూడు వర్గాలుగా విభజించి ఒకరికి 9 – 5 గంటలు, ఇంకొకరికి 9.30 –5.30, మరొకరికి 10 – 6 గంటల పనివేళలు నిర్ణయించాలని కూడా సూచించారు. ఇళ్ల నుంచి పనిచేసే ఉద్యోగులు టెలిఫోన్‌ ద్వారా, ఎలక్ట్రానిక్‌ పద్ధతుల్లోనూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

రైల్వే రాయితీలు కట్‌
రైళ్లలో జనసమ్మర్ధాన్ని నివారించే ఉద్దేశంతో కేంద్ర రైల్వే శాఖ ఇస్తున్న పలు రాయితీలను నిలిపివేస్తూ గురువారం ఆదేశాలు జారీ అయ్యాయి. రోగులు, విద్యార్థులు, దివ్యాంగుల కేటగిరీలో కొందరికి మాత్రం మినహాయింపు ఉంటుంది. మార్చి 20వ తేదీ అర్ధరాత్రి నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఈ ఆదేశాలు కొనసాగుతాయి. ఇప్పటివరకూ దాదాపు 53 వర్గాల వారికి రాయితీలు లభిస్తూండగా ఇక ఇవి 15కు మాత్రమే పరిమితమవుతాయి. వయోవృద్ధులు అనవసర ప్రయాణాలను నివారించేందుకు ఈ ఆదేశాలు ఉపయోగపడ తాయని అంచనా. ఈ నెల 20వ తేదీ ఆ తరువాత బుక్‌ చేసుకున్న టికెట్లకు ఈ షరతులు వర్తిస్తాయి. ఇప్పటికే బుక్‌ చేసుకున్న రాయితీ టికెట్లను ఎవరైనా క్యాన్సిల్‌ చేసుకుంటే వారి నుంచి క్యాన్సలేషన్‌ ఛార్జీలు వసూలు చేయమని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

ఐసీఎస్‌ఈ పరీక్షలువాయిదా
ఐసీఎస్‌ఈ సిలబస్‌లో 10, 12వ తరగతుల పరీక్షలను వాయిదావేస్తూ కౌన్సిల్‌ ఫర్‌ ద ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్స్‌  నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్, ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ ఈ నెలాఖరు వరకూ పరీక్షలను వాయిదా వేసుకోవాలని మానవ వనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పరీక్షలను యూజీసీ వాయిదావేసింది.

స్టాఫ్‌ సెలక్షన్‌ పరీక్షలు సైతం
కరోనా వైరస్‌ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యగా ఉద్యోగ నియామక పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిటీ (ఎస్‌ఎస్‌సీ)గురువారం ప్రకటించింది. వాయిదా వేసిన పరీక్షల్లో మార్చి 20న జరగాల్సిన కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌ ఎగ్జామినేషన్‌తోపాటు మార్చి 30న జరగాల్సిన జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్‌ కాంట్రాక్ట్‌) పరీక్షలు ఉన్నాయి.

వృద్ధులు, పిల్లలు ఇళ్లకే పరిమితం
వైరస్‌ విస్తృతి నేపథ్యంలో దేశంలో 65 ఏళ్ల పైబడ్డ వృద్ధులు, పదేళ్ల లోపు వయసున్న వారు ఇళ్లకే పరిమితం కావాలని కేంద్ర ఆరోగ్య శాఖ సలహా ఇచ్చింది. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యనిపుణులకు మాత్రం ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఉంటుందని విదేశీ వ్యవహారాల శాఖ జాయింట్‌ సెక్రటరీ రవి తెలిపారు. మాస్కులు, శానిటైజర్ల వంటివాటిని అధిక ధరలకు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫార్మాస్యూటికల్‌ డిపార్ట్‌మెంట్, వినియోగదారుల శాఖలను కోరినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో వైరస్‌ సామూహికంగా వ్యాప్తి చెందడం లేదని ఆరోగ్యశాఖ తెలిపింది. పంజాబ్‌లో మరణించిన వ్యక్తి వృద్ధుడే కాకుండా మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు కూడా ఉన్న వారని తెలిపారు. మార్చి 22వ తేదీ నుంచి మార్చి 29 వరకూ అన్ని అంతర్జాతీయ విమానాలు భారత్‌లో అడుగుపెట్టకుండా నిషేధం విధించినట్లు భారత్‌ ప్రకటించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు