'ప్రపంచదేశాలు మోదీ వ్యాఖ్యలను అనుసరించాలి'

22 Aug, 2016 13:23 IST|Sakshi
'ప్రపంచదేశాలు మోదీ వ్యాఖ్యలను అనుసరించాలి'
న్యూఢిల్లీ: బలూచిస్తాన్లో పాకిస్తాన్ ప్రభుత్వం మానవహక్కులను కలరాస్తున్న విషయాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్తామని, అక్కడి ప్రజలకు మద్దతుగా నిలుస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై.. బలూచ్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న నాయకుడు మజ్దాక్ దిల్షాద్ బలూచ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచదేశాలు బలూచిస్తాన్ విషయంలో మోదీ వ్యాఖ్యలను అనుసరించాలని ఆయన మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. అలాగే.. కశ్మీర్ అనేది భారత అంతర్భాగానికి సంబంధించిన విషయం అని, బలుచిస్తాన్ వ్యవహారం అలా కాదన్నారు. అది అంతర్జాతీయ వ్యవహారం అని ఆయన తెలిపారు.
 
భౌగోళికంగా, చారిత్రాత్మకంగా కశ్మీర్ అనేది వందల సంవత్సరాలుగా భారత్లో భాగమని అన్నారు.  బలుచిస్తాన్ మాత్రం 700 సంవత్సరాలుగా స్వతంత్ర్య రాజ్యంగా ఉందని, దానికి సొంత పార్లమెంట్.. హౌస్ ఆఫ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్ ఉన్నాయని దిల్షాద్ బలూచ్ గుర్తుచేశారు. అరబ్ ప్రపంచం, యూరోపియన్ యూనియన్, నార్త్ అమెరికా లాంటి బలమైన దేశాలు, కూటములు బలూచిస్తాన్ విషయంలో పాక్పై ఆంక్షలను విధించాలని ఆయన కోరారు. 
 
మరిన్ని వార్తలు