రాజధానిలో 'వరల్డ్ స్టేషనరీ ఎక్స్ పో'..!

28 Jul, 2016 21:51 IST|Sakshi
రాజధానిలో 'వరల్డ్ స్టేషనరీ ఎక్స్ పో'..!

న్యూఢిల్లీః పాఠశాల విద్యార్థులకు, కార్యాలయాలకు  కావలసిన పరికరాలు, నోట్ బుక్ లు, డైరీలు మొదలైన ఉత్పత్తులతో కూడిన ప్రపంచ స్టేషనరీ ఎక్స్ పో దేశ రాజధాని నగరంలో ప్రారంభం కానుంది. జూలై 29న ప్రారంభమయ్యే  అతిపెద్ద ఎక్స్ పో మూడురోజులపాటు కొనసాగనుంది.

దేశ రాజధాని నగరం ఢిల్లీ ప్రగతి మైదానంలో ప్రపంచ స్టేషనరీ ఎక్స్ పో శుక్రవారం ప్రారంభం కానుంది. సుమారు 7000 నుంచి 8000 వరకూ స్టేషనరీ ఉత్పత్తులే లక్ష్యంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. మెక్స్ ఎగ్జిబిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రత్యేక ప్రదర్శనను నిర్వహిస్తుంది. జూలై 29న ప్రారంభమై మూడు రోజుల పాటు అంటే 31వ తేదీ వరకూ జరిగే ఈ స్టేషనరీ ఫెయిర్ లో ప్రపంచవ్యాప్తంగా దొరికే వివిధ రకాల స్టేషనరీ ఉత్పత్తులు ఒకేచోట లభ్యమయ్యేట్లుగా.. వన్ స్టాప్ హబ్ ను ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు చెప్తున్నారు. ఈ స్టేషనరీ ఎక్స్ పో లో వారి వారి బడ్జెట్ ను బట్టి చిన్న, మధ్య తరహా, భారీ కార్యాలయాలు, సంస్థలు, విద్యా సంస్థలు, మొదలైన అన్ని తరహాల వారికి అందుబాటులో ఉండేట్లుగా స్టేషనరీ ఉత్పత్తులను ఇక్కడ  ఉంచనున్నారు.

వినియోగదారులు ముఖ్యంగా ఆఫీసు, సంస్థలకు అవసరమైన పరికరాలను, ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఈ భారీ ఎక్స్ పో  ప్రధాన కేంద్రంగా చెప్పొచ్చు. పెన్నులు, పెన్నిళ్ళు, కాగితాలు వంటి కార్యాలయాలు, విద్యాసంస్థలకు సంబంధించిన ఉత్పత్తులతోపాటు, పదిరూపాయలు మొదలుకొని వంద రూపాయల వరకూ అన్ని పరిథుల్లోనూ వస్తువులు అందుబాటులో ఉంటాయని మెక్స్ ఎక్స్ పో ఎగ్జిబిషన్ డైరెక్టర్ హిమానీ గులాటీ తెలిపారు. దీంతోపాటు గిఫ్ట్ ఎక్స్ పో, ఆఫీస్ ఎక్స్ పో   పేరున మరో రెండు ప్రదర్శనలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లతో కూడిన సుమారు 150 కంపెనీల వస్తువులు ఈ ప్రత్యేక వేదికలో లభ్యమౌతాయని గులాటీ తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు