బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే...

1 Nov, 2019 12:18 IST|Sakshi

మనుషుల్ని ప్రేమించే వీళ్లు.. జంతువుల హక్కుల కోసం పోరాడుతారు. అందుకు కఠినతరమైన ఆహార నియమాలు పాటిస్తారు. తీసుకునే ఆహారంలో, వేసుకునే దుస్తుల్లోనూ తమ ప్రత్యేకతను చాటుకుంటారు. వాళ్లతో మాట కలిపితే.. జంతువుల వేదనను కథలు కథలుగా చెప్పి మనలో ఓ ఉద్యమానికి బీజం వేస్తారు. వారే.. పూర్తిగా మొక్కల ద్వారా వచ్చే ఆహారాన్ని మాత్రమే తిని జంతు సంరక్షణకు కృషి చేస్తున్న వీగన్లు. ప్రపంచ వీగన్ల దినోత్సవం సందర్భంగా వారికి సంబంధించిన కొన్ని విశేషాలు..

-వీగన్‌ సొసైటీ 1944లో ప్రారంభమైంది. ఇద్దరు స్నేహితులు.. వెజిటేరియన్‌, నాన్‌ వెజిటేరియన్‌ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలన్న ఆవశ్యకతతో  ‘ది వీగన్‌ సొసైటీ’ని స్థాపించారు. నేటికి ఈ సంస్థ ప్రారంభమై 75 ఏళ్లు. వరల్డ్‌ వీగన్‌ మాసంగా సెలబ్రేట్‌ చేసుకునే నవంబర్‌ నెలలో పెద్ద ఎత్తున వీగనిజం, వీగన్‌గా ఉంటే కలిగే ప్రయోజనాల గురించి  పలు కార్యక్రమాలు నిర్వహిచండం పరిపాటి. 

పల్లీ పాలతో ప్రోటీన్లు..

వీగనిజం పాటించే వాళ్లు ముఖ్యంగా  కఠినమైన  ఆహార పద్దతులను పాటిస్తారు. కేవలం మొక్కల ద్వారా లభించే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. పాలపదార్థాలు గానీ, జంతువుల నుంచి వచ్చే ఏ ఆహారాన్ని తీసుకోరు. కానీ వాటికి ప్రత్యామ్నాయంగా ఆహారంలో పోషక విలువలు తగ్గకుండా జాగ్రత్తలు వహిస్తారు. పాలకు బదులుగా పల్లీలనుంచి తీసిన పాలు, కొబ్బరి, జీడిపప్పుతో చేసిన ఛీజ్‌ కేక్‌ లాంటివి తిని పోషకాహార లోపాన్ని అధిగమిస్తారు.

సోయాతో దుస్తుల తయారీ
వీగన్లు తాము వేసుకునే దుస్తుల్లోనూ జంతు సంబంధమైనవి లేకుండా కేవలం లెనిన్‌, కాటన్‌తో రూపొందిన దుస్తులకే ప్రాధాన్యత ఇస్తారు. చలిని తట్టుకోవడానికి మనం ధరించే కోట్లు, బెల్టులు, టోపీల తయారికి లక్షల కొద్ది మూగజీవుల్ని వధిస్తున్నారనే కారణంతోనే వీగన్లు.. ఈ దుస్తులను నిషేధిస్తున్నారు. జంతు చర్మంతో తయారవుతున్న ఉత్పత్తులకు బదులుగా... కృత్రిమ నార, సోయా ఉత్పత్తులు, రీసైకిల్డ్‌ నైలాన్‌, కార్డ్‌ బోర్డులతో రూపొందిన దుస్తులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక స్టెల్లా మెక్‌క్యాట్నీ, నాస్టీగాళ్‌, మ్యాట్‌ అండ్‌ న్యాట్‌, బియాండ్‌ స్కిన్‌ బ్రాండ్లు ప్రస్తుతం వీగన్‌ ఫ్యాషన్లలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు సైతం తక్కువే. వీగన్‌ బ్రాండ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పెటా సంస్థ.. ప్రతీ సంవత్సరం వీగన్‌ ఫ్యాషన్‌ అవార్డును కూడా అందజేస్తుంది. 

కొలెస్ర్టాల్‌ ఫ్రీ
వీగన్‌ ఫుడ్‌ బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది. గుడ్లు, మాంసానికి ప్రత్యామ్నాయంగా వెజిటేరియన్‌ గుడ్లను, వెజిటేరియన్‌ మాంసాన్ని అభివృద్ధి చేశారు ఢిల్లీ ఐఐటికి చెందిన పరిశోధకులు. వెజిటేరియన్‌ మీట్‌గా పిలిచే ఈ ఉత్పత్తుల్లో రుచి, పోషకాల్లో మాంసంలో ఉండే పోషకాలకు ఏ మాత్రం తీసిపోవని తెలిపారు. అంతేకాకుండా జంతువుల నుంచి సంక్రమించే బర్డ్‌ ఫ్లూ వంటి వ్యాధులు నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని పేర్కొన్నారు. 

సెలబ్రెటిలీలు సైతం...
జంతు ప్రేమికులతో పాటు జంతువుల పక్షాన పోరాడుతున్న వీగన్ల సంఖ్య హైదరాబాద్‌లో వేగంగా పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే.. హైదరాబాద్ వీగన్ల రాజధానిగా మారుతోంది. హైదరాబాద్‌ వీగన్స్‌లో 90 శాతం మంది యువతీ యువకులే కావడం విశేషం. వీగనిజాన్ని స్వీకరించి రకరకాల ప్రచారాలతో మరికొంత మందిని వీగనిజంలోకి వీరు ఆహ్వానిస్తున్నారు. వీగనిజాన్ని ప్రమోట్‌ చేయడానికి వీకెండ్స్‌లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  ఏదైనా రెస్టారెంట్లలో మనం వీకెండ్ సెలబ్రేట్ చేసుకుంటుంటే ఈ సమూహం అక్కడికి వస్తుంది. మనం బతకడానికి జంతువులు చావాల్సిందేనా అని ఓ ప్రశ్న మనముందు ఉంచి వెళ్లిపోతుంది. సినిమా థియేటర్‌కు వెళ్తాం. అక్కడ ముఖానికి మాస్కులు వేసుకున్న ఓ గుంపు ఏదో ప్రదర్శిస్తూ కనిపిస్తుంది. వాళ్ల చేతుల్లోని ప్లకార్డుల్లో జంతువుల్ని మనం ఎంతగా హింసిస్తున్నామో ఉంటుంది. సాధారణ మానవుల నుంచి ఇప్పుడు  అమల,అనుష్క శర్మ, సొనాక్షి సిన్మా, సోనమ్‌ కపూర్‌, విరాట్‌ కోహ్లీ లాంటి సెలబ్రిటీలు కూడా వీగనిజాన్ని ప్రోత్సహిస్తున్నారు, ఆచరిస్తున్నారు కూడా... 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా