చైనా ఆస్పత్రి కన్నా పదింతలు పెద్దది

5 Jul, 2020 14:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్‌ సెంటర్‌ను ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించింది. దేశ రాజధానిలో కరోనా ఉధృతి కొనసాగుతున్న తరుణంలో భారీ కేంద్రాన్ని నిర్మించ తలపెట్టిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అనుకున్న సమయంలోనే నిర్మాణాన్ని పూర్తి చేశారు. 10 వేల బెడ్స్‌ సామర్థ్యం గల కోవిడ్‌ కేంద్రాన్ని ఢిల్లీ లెఫ్ట్‌ నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ ఆదివారం ప్రారంభించారు. దీనికి ‘సర్దార్‌ పటేల్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ అండ్‌ హాస్పిటల్‌’ అని పేరు పెట్టారు. దక్షిణ ఢిల్లీ సమీపంలోని చత్తర్‌పూర్‌ ఆధ్యాత్మిక క్షేత్రం రాధాస్వామి సత్సంగ్‌ బియాస్‌ కాంప్లెక్స్‌ను తాత్కాలిక కరోనా ఆస్పత్రిగా మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 1700 అడుగుల పొడవు, 700 అడుగుల వెడల్పున్న ఈ కేంద్రం దాదాపు 20 ఫుట్‌బాల్‌ మైదానాలకు సమానమైన స్థలంలో నిర్మితమై ఉంది. (ఒక్కరోజులో 24వేలకు పైగా కరోనా కేసులు)

చైనాలో నిర్మించిన కోవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రికి ఇది పదింతలు పెద్దది కావడం విశేషం. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో దీన్ని ఏర్పాటు చేసింది. దీనిలో మొత్తం నాలుగు విభాగాలు ఉండగా ఒక్కొక్క దానిలో 250 పడకలు ఉంటాయి. వాటిలో ఒక విభాగంలో ఆక్సిజన్, ఐసీయూ సౌకర్యాలు ఉంటాయి. ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్(ఐటీబీపీ)‌ విభాగానికి చెందిన వైద్య సిబ్బంది ఈ ఆసుపత్రిలో పనిచేస్తారు. ఈ మేరకు అనిల్‌ బైజాల్‌ ట్విటర్‌ వేదికగా ఆస్పత్రి వివరాలను వెల్లడించారు. ఈ కోవిడ్‌ కేంద్రాన్ని ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు పలువురు కేంద్రమంత్రులు పరిశీలించారు.


Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు