చాలెంజ్‌.... కొత్తదే కానీ చెత్తది!

5 Jun, 2019 02:31 IST|Sakshi

ఐస్‌ బకెట్‌ చాలెంజ్, కికీ చాలెంజ్, మైక్రోవేవ్, టైడ్‌పాడ్‌ చాలెంజ్‌.. ఇలా సోషల్‌ మీడియాలో నెటిజన్లకు ఏది పట్టుకుంటే అదో వేలం వెర్రిగా మారుతోంది. ఇప్పుడు కొత్తగా ఓ చెత్త చాలెంజ్‌ వైరల్‌గా మారింది. అదే వాక్యూమ్‌ చాలెంజ్‌. దీనినే బిన్‌ బ్యాగ్‌ చాలెంజ్‌ అని కూడా పిలుస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇదే ట్రెండింగ్‌లో ఉంది. ఈ చాలెంజ్‌ కోసం చెత్తను నింపే అతి పెద్ద ప్లాస్టిక్‌ బ్యాగ్, ఒక వాక్యూమ్‌ క్లీనర్‌ కావాలి. ఈ చాలెంజ్‌లో పాల్గొనే వాళ్లు కాళ్లని గుండెలకు దగ్గరగా పెట్టుకొని ముడుచుకొని ఆ ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో కూర్చుంటారు. దీంతో అదో బెలూన్‌ మాదిరిగా మారుతుంది. ఆ బ్యాగ్‌ని అన్ని వైపుల మూసేసిన మరొక వ్యక్తి వాక్యూమ్‌ క్లీనర్‌తో ఆ బ్యాగ్‌లో ఉన్న గాలిని పూర్తిగా బయటకు తీసేస్తారు.

ఆ క్రమంలో చాలెంజ్‌ లో పాల్గొనేవారి ఒంటికి కితకితలు పెట్టినట్టుగా అదో మాదిరిగా అనిపిస్తుంది. లోపల కూర్చున్న వాళ్ల ముఖకవళికలు రకరకాలుగా మారుతూ ఉంటాయి. గాలంతా బయటకు రాగానే ఆ ప్లాస్టిక్‌ బ్యాగ్‌ ఒంటికి అతుక్కుంటుంది. చివరికి స్కిన్‌ టైట్‌తో బాడీ సూట్‌లా మారుతుంది. అలా కొన్ని గంటలు ఉన్నాక వారిని బయటకు తీస్తారు. అనంతరం దానిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. ఎంత ఎక్కువ సేపు ఉంటే అంత గొప్ప. అమ్మాయిలైతే ఆ చెత్తబ్యాగ్‌ ఒంటికి అతుక్కుంటే ఒక శిల్పంలా ఉన్నామంటూ పోజులిస్తున్నారు. ఎక్కువగా చిన్నపిల్లల్నే కూర్చోబెట్టుకొని ఈ చాలెంజ్‌ నిర్వహిస్తున్నారు. ఇదంతా వినోదం కోసమేనని అనుకుంటున్నారు కానీ వారి ఆరోగ్యంతో ఆటలాడుతున్నట్టేనని, ఇలా వాక్యూమ్‌ క్లీనర్‌తో గాలిని బయటకు తీసేసి, అంతంత సేపు చిన్నారుల్ని ఆ బ్యాగుల్లో కూర్చోబెట్టడం వల్ల నరాలు దెబ్బతినే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఇంటి నుంచే మొదలైన చాలెంజ్‌ 
ఇలాంటి వెర్రిమొర్రి చాలెంజ్‌లన్నీ ఇప్పటివరకు టీనేజ్‌లో ఉండే యువతీయువకులు స్నేహితుల్ని ఆకర్షించడానికో, వారిని కవ్వించడానికో చేసేవారు. ఇంటి బయట బహిరంగ ప్రదేశాల్లోనే ఈ చాలెంజ్‌లు జరిగేవి. కానీ ఈ వాక్యూమ్‌ చాలెంజ్‌ ఇంటి నుంచే మొదలవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ తరహా ప్రమాదకర చాలెంజ్‌లకు దూరంగా ఉండాలని నచ్చజెప్పాల్సిన తల్లిదండ్రులే తమ పిల్లల్ని ఈ డస్ట్‌ బిన్‌ బ్యాగ్‌ల్లో చుట్టేసి వినోదం చూడటం ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలా బిన్‌ బ్యాగుల్లో కూర్చోబెట్టి గాలంతా తీసేస్తే మెదడుకి ఆక్సిజన్‌ తగ్గిపోయి సెరిబ్రల్‌ హైపోక్సియా అనే స్థితికి చేరుకుంటారని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూరోలాజికల్‌ డిజార్డర్స్‌ సంస్థకు చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు కొన్ని గంటలు గాలి లేని ఆ బ్యాగ్‌లో ముడుచుకొని కూర్చోవడం వల్ల కాళ్లు, చేతులు కదపలేరు. దీంతో రక్త ప్రసారం కూడా సరిగ్గా జరగదు. మరొకరు వచ్చి ఆ బ్యాగ్‌ని తీస్తేనే కానీ, వారంతట వారు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఈ చాలెంజ్‌ల వల్ల వినోదం సంగతి దేవుడెరుగు కానీ, లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

మరిన్ని వార్తలు