మరో ‘సర్జికల్‌’కు వెనుకాడం

10 Dec, 2018 10:21 IST|Sakshi

ఆర్మీ వైస్‌ చీఫ్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ దేవరాజ్‌ అన్బూ

డెహ్రాడూన్‌: సరిహద్దులకు ఆవల ఉన్న ఉగ్రవాదులపై అవసరమైతే మరోసారి సర్జికల్‌ దాడులకు వెనుకాడబోమని ఆర్మీ వైస్‌ చీఫ్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ దేవరాజ్‌ అన్బూ స్పష్టం చేశారు. శత్రువు సవాలు విసిరితే భారత ఆర్మీ తమ శక్తి సామర్థ్యాన్ని చూపేందుకు వెనుకాడదని ఆయన హెచ్చరించారు. డెహ్రాడూన్‌లో శనివారం జరిగిన భారత మిలిటరీ అకాడెమీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. కదనరంగంలో మహిళలను నియమించే అంశం పరిశీలనలో ఉందన్నారు. పాకిస్తాన్, చైనాలతో భారత్‌కు ఉన్న సరిహద్దు ప్రాంతాలకంటే మిగతా సరిహద్దు ప్రాంతాల్లో కాస్త భిన్నమైన పరిస్థితులుంటాయన్నారు. భారత్‌లో ఈ రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయన్నారు.

యుద్ధరంగంలో మహిళలను పంపించేందుకు ఈ ఏడాది జూలైలో భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ అనుమతించారని చెప్పారు. క్రమంగా మిలిటరీలో వివిధ స్థానాల్లో మహిళలను నియమిస్తామని వెల్లడించారు. కార్యక్రమం అనంతరం మిలిటరీ అధికారులతో దేవరాజ్‌ అన్బూ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జమ్మూ కశ్మీర్‌లోని ఉడీ సెక్టార్‌లో భారత భద్రతా బలగాల స్థావరాలపై 2016లో ఉగ్రవాదులు చేసిన దాడిలో 17 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా భారత మిలిటరీ బలగాలు అదే ఏడాది సెప్టెంబర్‌ 29న ఎల్‌వోసీ ఆవలిలోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్‌ దాడులు చేసి పాక్‌కు గట్టి హెచ్చరికను పంపిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు