తప్పుడు కేసుకూ శిక్ష ఉండాల్సిందే!

6 Oct, 2018 19:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఏ చట్టం కిందనైనా, ఎవరినైనా తప్పుడు కేసు బనాయించి విచారిస్తే అందుకు వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలి. పునరావాసం కల్పించాలి. ఇది మానవ హక్కులు, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒప్పందంలోని 14వ అధికరణలోని ఆరో సెక్షన్‌ తెలియజేస్తోంది. ఈ ఒప్పందాన్ని ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలు ఆమోదించగా, భారత దేశమే ఇంకా ఆమోదించలేదు. రాజ్యం అంటే, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎవరి ప్రాణాన్నైనా, స్వేచ్ఛనైనా అనవసరంగా హరించి నట్లయితే అందుకు కచ్చితంగా పరిహారం ఉండాలనే ఉద్దేశంతో ఈ అంతర్జాతీయ ఒప్పందాన్ని తీసుకొచ్చారు.

భారత రాజ్యాంగంలోని 21వ అధికరణం భారతీయుడికి జీవించే హక్కును, స్వేచ్ఛ హక్కును ప్రసాదిస్తున్న కారణంగా ఇంతవరకు ఈ అంతర్జాతీయ చట్టాన్ని ఆమోదించలేదు. కానీ దేశంలో ఎవరి ప్రాణాన్నైనా, స్వేచ్ఛనైనా అనవసరంగా హరించినట్లయితే రాజ్యం తిరిగి ఇచ్చే ప్రసక్తి ఎలా ఉంటుంది? ఉండదుకనుక భారతీయ పౌరులు తప్పుడు కేసులకు బలవుతున్నారు. అందుకని బాధితులకు నష్టపరిహారం ఇచ్చి వారికి పునరావాసం కల్పించే అవకాశం ఉండాలని భారత లా కమిషన్‌ అభిప్రాయపడింది. ఈ మేరకు ఓ చట్టాన్ని కూడా తీసుకరావాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన 277వ నివేదికలో సిఫార్సు చేసింది.

అమాయకులపై తప్పుడు కేసులను బనాయించిన అధికారులను ప్రాసిక్యూట్‌ చేసే చట్టం కూడా ఉండాలని లా కమిషన్‌ సూచించింది. ఇస్రో సైంటిస్ట్‌పై కేరళ పోలీసులు గూఢచర్యం కింద తప్పుడు కేసును బనాయించి సుదీర్ఘకాలం విచారించడం, ఈ కేసును సుప్రీం కోర్టు కొట్టివేడం, బాధిత సైంటిస్ట్‌ నష్టపరిహారం కోసం కోర్టుకెక్కడం, ఆయనకు 25లక్షల రూపాయలను చెల్లించాల్సిందిగా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం తదతిర పరిణామాల నేపథ్యంలో లా కమిషన్‌ సిఫార్సు ప్రాధాన్యతను సంతరించుకుంది.  

మరిన్ని వార్తలు