తమిళావనిలో అగ్రనేతలు

12 Oct, 2019 07:53 IST|Sakshi

మామల్లపురం సందర్శన చరిత్రను వివరించిన మోదీ

ఆసక్తిగా అన్నీ తిలకించిన జిన్‌పింగ్‌

చైనా అధ్యక్షుడికి బ్రహ్మాండ ఆహ్వానం

దారి పొడవునా అభిమానం చాటిన ప్రజానికం

పంచెకట్టుతో మోదీ ఆకర్షణ నిఘా వలయంలో చెన్నై

సాక్షి, చెన్నై: సంస్కృతి, సంప్రదాయాలకు, పురాణాలు, చరిత్రకు, ఆలయాలు, ఆధ్యాత్మికత, వారసత్వ సంపదలకు నెలవుగా, విభిన్న వర్గాల సమూహారంతో, మాతృ భాషాభిమానం మెండుగా నిండిన తమిళావని వేదికగా చైనా, భారత్‌ దేశాల అగ్రనేతలు జిన్‌పింగ్, మోదీ శుక్రవారం భేటీ అయ్యారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మామల్లపురం (మహాబలిపురం)ను సందర్శించారు. ఇక్కడి చరిత్రను మోదీ వివరించగా, జిన్‌పింగ్‌ ఆసక్తిగా విన్నారు. తమిళ సంప్రదాయానికి   అద్దం పట్టే రీతిలో పంచెకట్టుతో మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక, చెన్నైలో అడుగుపెట్టిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు తమిళ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా ఆహ్వానాలు పలుకుతూ, అభిమానాన్ని చాటుకున్నారు. తమిళ ప్రజానీకం అభిమానాన్ని ప్రశంసిస్తూ మోదీ సైతం ట్విట్‌ చేయడం విశేషంభారత్, చైనాల మధ్య సత్సంబంధాల మెరుగు దిశగా సాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఇరు దేశాల మధ్య సంప్రదింపులు, భేటీలు, ఒప్పందాల వేగం పెరిగి ఉన్నాయి. 

ఇందులో భాగంగా ఇటీవల భారత ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లి వచ్చారు. తాను సైతం అంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనకు రెడీ అయ్యారు. కొన్ని శతాబ్దాల క్రితమే తమ దేశంతో సంబంధాల్ని కల్గి ఉన్న తమిళనాడులోని కాంచీపురం జిల్లా మామల్లపురంను జిన్‌పింగ్‌ తన పర్యటనకు వేదికగా ఎంపిక చేసుకున్నారు. దీంతో మామల్లపురం మహాసుందరంగా తీర్చిదిద్దబడింది. ఆహారపు అలవాట్లలో గానీ, సంస్కృతి, సంప్రదాయాలను ఆచరించడంలో గానీయండి, అభిమానాన్ని చాటుకోవడంలో గానీయండి ప్రత్యేకంగా నిలిచే తమిళులు చైనా అధ్యక్షుడ్ని బ్రహ్మాండంగా తమ గడ్డపైకి ఆహ్వానించేందుకు తగ్గట్టు సర్వం సిద్ధం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఇంత వరకు కల్పించని రీతిలో, విమానాశ్రయం నుంచి గిండి వరకు, గిండి నుంచి ఓఎంఆర్, ఈసీఆర్‌ మీదుగా మామల్లపురం వరకు దారి పొడవునా చైనా అధ్యక్షుడ్ని స్వాగతించారు.

భద్రత కట్టుదిట్టంగా..
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ రాకతో ముందుగానే భద్రతా ఏర్పాట్లు చేసినా, శుక్రవారం ఉదయాన్నే ఆ భద్రత పది అంచెలకు చేరింది. జిన్‌పింగ్‌ కాన్వాయ్‌ సాగే మార్గాల్ని అన్నావర్సిటీ నిపుణుల ద్వారా ఆరు డ్రోన్ల సాయంతో పర్యవేక్షించి, 30 వేల ఫొటోలను తీశారు. వాటిని పరిశీలించి, ఎక్కడెక్కడ భద్రత మరింత కట్టుదిట్టం చేయాలో అన్నట్టుగా మరింత ముందుకు సాగారు. రోడ్లపై చిన్న పాటి దుమ్ముకూడా లేని రీతిలో ఏర్పాట్లు చేసి, అడుగడుగునా రోడ్డు మార్గంలో తమిళ పోలీసులు, ఆకాశ మార్గంలో వైమానిక దళం హెలికాప్టర్లు చక్కర్లు కొడుతూ, సముద్ర తీరంలో భారత్, చైనా నౌకాదళం నౌకల గస్తీ నడుమ భద్రత సాగింది.

మోదీ రాక ..

భద్రతా ఏర్పాట్లన్ని సమర్థవంతంగా ఉండడంతో అగ్రనేతల పర్యటనకు  ఏర్పాట్లు చేశారు. సరిగ్గా 11.20 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్‌ ఇండియా విమానంలో చెన్నైకు వచ్చారు. విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్, సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం, స్పీకర్‌ ధనపాల్, మంత్రులు, అన్నాడీఎంకే – బీజేపీ మిత్ర పక్షానికి చెందిన డీఎండీకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్, తమిళ మానిల కాంగ్రెస్‌ నేత జీకే వాసన్, పీఎంకే నేత జీకే మణి,  పుదియ తమిళగం నేత కృష్ణస్వామి, బీజేపీ నేతలు పొన్‌ రాధాకృష్ణన్, హెచ్‌ రాజా , ఇలగణేషన్‌ఆహ్వానం పలికారు. విమానం దిగగానే, సిద్ధంగా ఉన్న హెలికాప్టర్‌లో కోవలం సమీపంలోని తిరువిడుందై హెలిప్యాడ్‌కు బయలుదేరారు. అక్కడ మం›త్రులు జయకుమార్,పాండియరాజన్, బెంజమిన్‌ స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కోవళంసమీపంలోని తాజ్‌హోటల్‌కు ప్రధాని బయలుదేరి వెళ్లారు.

సంస్కృతి చాటే ప్రదర్శనలతో ఆహ్వానం..
ప్రధాని చెన్నైకు చేరుకోవడంతో చైనా అధ్యక్షుడికి ప్రాధాన్యతను కల్పించే రీతిలో మరింతగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తమ రాష్ట్ర రాజధానికి అతిథిగా వస్తున్న జిన్‌పింగ్‌కు బ్రహ్మాండ ఆహ్వానం పలికే విధంగా విమానాశ్రయంలో ఏర్పాట్లు చేశారు. తమిళ సంస్కృతి, సంప్రదాయాల్ని చాటే రీతిలో గరగాట్టం, మయిల్‌ ఆట్టం, వొయిలాట్టం, తప్పాట్టం, భారత నాట్యం   కళా ప్రదర్శనలతో జిన్‌పింగ్‌కు ఆహ్వానం పలికేందుకు సిద్ధమయ్యారు. విమానాశ్రయ పరిసరాలే కాదు, జిన్‌పింగ్‌ కాన్వాయ్‌ సాగే మార్గాల్లో అక్కడక్కడ ఇదే రకంగా ఏర్పాట్లు జరిగాయి. అంతే కాదు, అరటి గెలలు, చెరకులు, కాయగూరలతో తోరణాలు అంటూ జిన్‌పింగ్‌కు పూర్తి ప్రాధాన్యతను ఇస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. సరిగ్గా రెండు గంటలకు విమానాశ్రయంలో జిన్‌ పింగ్‌ విమానం ల్యాండింగ్‌ కాగా, అందులో నుంచి దిగి వచ్చిన ఆయనకు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్, సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం, స్పీకర్‌ ధనపాల్‌ స్వాగతం పలికారు.

కళా ప్రదర్శనలను తిలకిస్తూ ముందుకు సాగిన జిన్‌పింగ్‌కు పూర్ణకుంభ స్వాగతం పలికేందుకు మైలాపూర్‌ నుంచి వచ్చిన శివాచార్యులు ప్రయత్నించారు. అయితే, అక్కడ ఆ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లే వాళ్లు లేని దృష్ట్యా, వాటిని చూస్తూనే నేరుగా కారులోకి ఎక్కేశారు. చైనా నుంచి వచ్చిన అత్యాధునిక వసతులు, భద్రతా ఏర్పాట్లతో కూడిన నాలుగు కార్లులో ఓ కారును ఎంపిక చేసి అందులో పయనం సాగించారు.  దారి పొడవునా విద్యార్థులు, ప్రజానీకం, అన్నాడీఎంకే, బీజేపీ వర్గాలు, ఇతర పార్టీలకు చెందిన వాళ్లు సైతం జిన్‌పింగ్‌ ఫొటో , భారత దేశ జాతీయ పతాకం, చైనా జాతీయ పతాకం చేతబట్టి ఆహ్వానం పలికారు. కాసేపు గిండి హోటల్‌లో విశ్రాంతి తీసుకున్న అనంతరం మామల్లపురానికి పయనమైన జిన్‌ పింగ్‌కు 35 కి.మీ దూరం బ్రహ్మాండ ఆహ్వానం పలికే రీతిలో ప్రజానీకం ముందుకు సాగడం విశేషం. అలాగే, కొన్ని చోట్ల ఇక్కడి చైనీయులు సైతం తమ అధ్యక్షుడికి ఆహ్వానం పలుకుతూ, ఆయన చిత్ర పటాల్ని , జాతీయ పతాకాన్ని చేత బట్టిబారులు తీరారు.

మోదీ ప్రశంస.. మామల్లపురం సందర్శన..
చైనా అధ్యక్షుడికి బ్రహ్మాండ ఆహ్వానం పలికే విధంగా చెన్నైలో సాగిన ఏర్పాట్లను ప్రశంసిస్తూ మోదీ అభినందించారు. చెన్నైకు చేరుకున్న కాసేటికి ఆయన ఆంగ్లం, తమిళం, చైనా భాషల్లో ట్విట్‌ చేశారు. జిన్‌పింగ్‌ను మామల్లపురం వేదికగా కలవనుండడం ఆనందంగా ఉందన్నారు. ఈ భేటీతో సత్సంబంధాలు మరింతగా బలపడుతుందని పేర్కొంటూ, సంస్కృతి, సంప్రదాయాలకు పేరు గడించిన తమిళనాడులో జిన్‌పింగ్‌కు బ్రహ్మాండ ఆహ్వానం పలకడం అభినందనీయమని కొనియాడారు. ఇక, సాయంత్రం ఐదు గంటల సమయంలో మహాబలిపురం చేరుకున్న మోదీ తమిళ సంప్రదాయాన్ని చాటే రీతిలో తెల్లపు వర్ణంతో చొక్క, పంచకట్టు, భుజాన కండువాతో ప్రత్యక్షం కావడం అందర్నీ ఆనందంలో ముంచింది. తమిళ సంప్రదాయాల్ని గౌరవించే రీతిలో ఆయన పంచెకట్టుతో జిన్‌పింగ్‌కు ఆహ్వానం పలకడం, ఇద్దరు కలిసి మహాబలిపురంను సందర్శించడం చోటుచేసుకున్నాయి. ముందుగా అర్జున తపస్సు, కృష్ణుడి వెన్నముద్దను సందర్శించారు. అనంతరం పంచరథాలను తిలకించారు. అక్కడ కాసేపు కూర్చుని కొబ్బరి బోండం స్వీకరించారు. చివరకుగా సముద్ర తీరంలో ఉన్న ఆలయాన్ని సందర్శించినానంతరం అక్కడ జరిగిన వేడుకకు హాజరయ్యారు. జిన్‌పింగ్‌తో కలిసి ఎక్కువ సమయం మోదీ  మామల్లపురంలో నడుస్తూ, అక్కడి చరిత్రను వివరిస్తూ ముందుకు సాగారు.

స్టార్‌ హోటళ్లు ఫుల్‌....
ఇద్దరు అగ్రనేతల రాకతో ఇరు దేశాల అధికారులు సైతం చెన్నైకు తరలి వచ్చారు. జిన్‌పింగ్‌తో పాటు వచ్చిన భద్రతా బలగాలకు  గిండి ఐటీసీ గ్రాండ్‌ చోళలో బస ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి కోవళంలోని తాజ్‌లో  ఏర్పాట్లు చేశారు. భద్రత కారణాల దృష్ట్యా, ఈ ఇద్దరు నేతలకు వేర్వేరు హోటళ్లను ఎంపిక చేశారు. ఇక, చైనా నుంచి వచ్చిన ఇతర అధికారులకు చెన్నైలోని అనేక స్టార్‌ హోటళ్లలో బస ఏర్పాట్లు చేశారు. అలాగే, ఢిల్లీ నుంచి వచ్చిన భారత అధికారులకు మరికొన్ని స్టార్‌ హోటళ్లల్లో ఏర్పాట్లు చేశారు.

విందు.. తమిళ, చైనా వంటకాలు..
తమిళనాడు ఇడ్లీ, దోసె, సాంబార్‌ ప్రత్యేక డిష్‌. దీని గురించి ఇప్పటికే మోదీ ప్రత్యేక కితాబు సైతం ఇచ్చి ఉన్నారు. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్‌కు తమిళ వంటకాల రుచి అందించేందుకు తగ్గ ఏర్పాట్లు చేసి ఉన్నారు. పైన పేర్కొన్న వాటితో పాటు శనగపప్పు కుర్మా, పూరి, బియ్యపు హల్వా, టమాట రసంతో పాటు కారైక్కుడి, చెట్టినాడు రుచులతో కూడిన మెనూ వంటకాలతో విందుకు ఏర్పాట్లు చేయడం విశేషం. అలాగే, చైనా వంటకాలను సిద్ధం చేసి అందించేందుకు ప్రత్యేకంగా ఆదేశం నుంచి నలభీములు ఇక్కడికి వచ్చి ఉండడం గమనార్హం. అలాగే, చైనా పర్యటనకు వెళ్లిన మోదీ జిన్‌పింగ్‌కు ప్రత్యేక ఆకర్షణతో కూడిన కానుక ఇచ్చి ఉన్నారు. తాజాగా చైనా నుంచి మోదీ కోసం జిన్‌పింగ్‌ ప్రత్యేక కానుకను ఇక్కడికి తీసుకొచ్చి ఉన్నారని, శనివారం ఇది అందజేయడం జరుగుతుందని, అంత వరకు ఆ కానుక ఏమిటో అన్నది సస్పెన్స్‌ అంటూ చైనా రాయబార కార్యాలయ అధికారులు పేర్కొంటున్నారు.

టేక్‌ డైవర్షన్లు....
మోదీ, జిన్‌పింగ్‌ పర్యటన దృష్ట్యా, చెన్నైలో ట్రాఫిక్‌ టేక్‌ డైవర్షన్లు వాహన చోదకులకు ముచ్చమటలు పట్టించాయి. తాంబరం నుంచి విమానాశ్రయం మీదుగా గిండి మార్గాన్ని మూసి వేశారు. అన్ని వాహనాలను బైపాస్‌ మీదుగా మధురవాయిల్‌ వైపుగా దారి మళ్లించారు. ఇక, గిండి స్టార్‌ హోటల్‌ నుంచి అన్నా వర్సిటీ మీదుగా షోళింగనల్లూరు, ఓఎంఆర్, ఈసీఆర్‌ మార్గంలు అన్నీ నిర్మానుష్యం అయ్యాయి. ఆ మార్గాలన్నీ పోలీసుల ఆధీనంలోకి వచ్చేశాయి. అటు వైపుగా సాగాల్సిన వాహనాలను టేక్‌ డైవర్షన్‌ అంటూ పలు ప్రాంతాల గుండా దారి మళ్లించారు. దీంతో ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ కష్టాలు తప్పలేదు.

తమిళ.. చైనా మీడియాలో..
రెండు దేశాల అగ్ర నేతలు ఇద్దరు మామల్లపురం సందర్శనను తమిళ మీడియాలు అన్నీ పూర్తి స్థాయిలో ప్రత్యక్ష ప్రసారంగా అందించడంతో టీవీలకు అతుక్కుపోయిన వాళ్లు ఎక్కువే. ఉదయం నుంచి రాత్రి వరకు జిన్‌పింగ్‌ పర్యటన గురించే అధిక ప్రాధాన్యతను ఇవ్వడం విశేసం.  ఈ ఇద్దరు నేతల భేటీ నిమిత్తం చైనా మీడియా ప్రతినిధులు సైతం ఇక్కడికి తరలివచ్చారు. ఈ భేటీ గురించి ఆయా మీడియాలు పలు రకాల అంశాలను ప్రస్తావించారు. పరస్పర సహకారానికి వేదికగా, బంధం బలానికి మరింత చేరువగా, సరిహద్దు సమస్యలు సామరస్య పూర్వక పరిష్కారానికి, పారిశ్రామిక ప్రగతి, ఎగుమతులు, దిగుమతులకు భేటీ వేదిక అంటూ చైనా మీడియా వార్తలు, కథనాలు ఇవ్వడం గమనార్హం. ఇక, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ జిన్‌పింగ్‌కు ఆహ్వానం పలుకుతూ ప్రకటన చేశారు. ఈ పర్యటన ప్రయోజనకరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

నేటి పర్యటన
శనివారం కూడా జిన్‌ పింగ్, మోదీ పర్యటన సాగనుంది. దీంతో ఆయా మార్గాల్లో రెండో రోజు కూడా అదే టేక్‌ డైవర్షన్లు మధ్యాహ్నం వరకు సాగనున్నాయి. రెండో రోజు ఉదయం గిండి నుంచి బయలు దేరే  జిన్‌ పింగ్‌ 9.50 గంటలకు కోవళం తాజ్‌కు చేరుకుంటారు. అక్కడ 10 గంటల నుంచి 10.50 వరకు ప్రధాని నరేంద్ర మోదీ, జిన్‌పింగ్‌ల భేటీ సాగుతుంది. అనంతరం 10.50 నుంచి 11.40 వరకు ఇరు దేశాల అధికారుల భేటీ ఉంటుంది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చే విందుతో 1.30 గంటలకు విమానాశ్రయం చేరుకునే జిన్‌ పింగ్‌ నేపాల్‌కు బయలుదేరి వెళ్తారు.

మరిన్ని వార్తలు