మాతృభాషకు ఆదరణ తగ్గుతోంది

27 Jun, 2016 04:53 IST|Sakshi
మాతృభాషకు ఆదరణ తగ్గుతోంది

ఆవేదన వ్యక్తం చేసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో మాతృభాషకు ఆదరణ తగ్గుతోందని పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కూడా భాషా పరిరక్షణకు తగిన చర్యలు చేపట్టడంలేదని ఆయన మండిపడ్డారు. అమెరికాలో మాత్రం తెలుగు భాష వెలుగొందుతోందని పేర్కొన్నారు. శనివారం ఫిలడెల్ఫియాలో ఏర్పాటైన ‘పాఠశాల’ వార్షికోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రవాసాంధ్రులు తమ పిల్లలకు భాషా, సంస్కృతులను నేర్పించడంలో ముందంజలో ఉన్నారని, అమెరికాలో ‘పాఠశాల’ వంటి ప్రత్యేక శిక్షణా సంస్థలను దీని కోసం ఏర్పాటు చేయడం సంతోషకరమని చెప్పారు.

మాతృ భాష పట్ల ప్రవాసాంధ్రులు చూపుతున్న శ్రద్ధ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రముఖ పాత్రికేయులు నరిసెట్టి ఇన్నయ్య మాట్లాడుతూ అమెరికాలో తెలుగువారు నిర్వహించే ఉత్సవాలకు అక్కడి స్థానికులను కూడా ఆహ్వానించాలని కోరారు. యార్లగడ్డ దంపతులను స్థానిక ప్రవాసాంధ్రులు, పాఠశాల సిబ్బంది సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని తానా ప్రాంతీయ ఉపాధ్యక్షుడు పొట్లూరి రవి నిర్వహించారు.

మరిన్ని వార్తలు