రఫేల్‌పై తీర్పును పునఃసమీక్షించండి

3 Jan, 2019 04:46 IST|Sakshi

న్యూఢిల్లీ: రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలుపై వెలువరించిన సుప్రీం తీర్పును పునఃసమీక్షించాలని మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్‌సిన్హా, అరుణ్‌శౌరీ, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ బుధవారం సుప్రీం కోర్టును కోరారు. 36 రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం డిసెంబర్‌ 14న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎటువంటి సంతకాలు లేకుండా ప్రభుత్వం సమర్పించిన సీల్డ్‌కవర్‌ నివేదికపై ఆధారపడి సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించిందని వారు కోర్టుకు విన్నవించారు.

‘కేవలం నమ్మశక్యంకాని ఆధారాల ఆధారంగా కోర్టు ఈ తీర్పునిచ్చిందని భావిస్తున్నాం. కనీసం సంతకాలు కూడా లేని సీల్డ్‌కవర్‌ నివేదికపై తీర్పు ఇవ్వడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమ’ని యశ్వంత్‌సిన్హా, అరుణ్‌ శౌరీ, ప్రశాంత భూషణ్‌లు పిటిషన్‌లో వివరించారు. తీర్పును రిజర్వ్‌ చేసిన తరువాత అనేక కొత్త వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని, వాటి మూలాల్లోకి వెళ్లి కోర్టు విచారించాలని, ఆ లోపు తీర్పును సమీక్షించాలని వారు కోర్టుకు విన్నవించారు.

మరిన్ని వార్తలు