బీజేపీ సర్కారుపై యశ్వంత్‌ సిన్హా ఫైర్‌

6 Aug, 2019 10:12 IST|Sakshi

న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా మండిపడ్డారు. ఫక్తు రాజకీయాల కోసమే బీజేపీ ఇటువంటి నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ అసంతృప్త నేత సిన్హా విమర్శించారు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా రద్దు చేయడం వల్ల ఒనగూరే ప్రయోజనం శూన్యమని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం నేపథ్యంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలోని కొన్ని ముఖ్యమైన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయంగా లబ్ది పొందేందుకు మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని యశ్వంత్‌ సిన్హా విమర్శించారు.

‘370, 35ఏ అధికరణలను రద్దు చేయడం ద్వారా దేశానికి ఎటువంటి ప్రయోజనం లేదు. ఎన్నికల్లో గెలవాలనే దురుద్దేశంతోనే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఎత్తుగడ ద్వారా.. ఇందిరా గాంధీ మరణం తర్వాత ఆ సానుభూతితో రాజీవ్‌ గాంధీ అత్యధిక సీట్లు గెలిచి, కాంగ్రెస్‌ ఏకపక్ష విజయం సాధించినట్లుగా.. ఈ కశ్మీర్‌ అంశం వల్ల బీజేపీ కూడా ఈమేర లాభం పొందుతుంది లేదా రాజీవ్‌ రికార్డును అధిగమిస్తుంది’ అని సిన్హా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అదే విధంగా తమ స్వప్రయోజనాల కోసమే బీజేపీ సంచలన నిర్ణయాలు తీసుకుంటుందని, నోట్ల రద్దులాగే కశ్మీర్‌ అంశం కూడా రాజకీయ స్వలాభానికి సంబంధించిందేనని వ్యాఖ్యానించారు.

మరోవైపు కశ్మీర్‌ అంశంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. కొంతమంది మాత్రం సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఈ క్రమంలో తమ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభలో కాంగ్రెస్‌ విప్‌ భువనేశ్వర్ కలిత రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ఆయన ట్వీట్‌ చేశారు. అదే విధంగా కాంగ్రెస్‌ పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఇక ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జనార్ధన్‌ త్రివేది కూడా బీజేపీ సర్కారు నిర్ణయాన్ని సమర్థించారు. ‘ నా మెంటార్‌ రామ్‌ మనోహర్‌ లోహియా ఆర్టికల్‌ 370కి పూర్తి వ్యతిరేకం. నిజానికి జాతీయవాదంతో నిండిపోయిన ప్రజలకు ప్రస్తుత నిర్ణయం ఆత్మ సంతృప్తి కలిగిస్తుంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన సమయంలో చేసిన తప్పిదం కాస్త ఆలస్యంగానైనా సవరించబడింది’ అని పేర్కొన్నారు. ఇక యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ ఇంతవరకు ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు