యాసిన్ భత్కల్ కు 12 రోజుల కస్టడీ

30 Aug, 2013 16:31 IST|Sakshi
యాసిన్ భత్కల్ కు 12 రోజుల కస్టడీ

ఢిల్లీ:నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహుద్దీన్ అగ్రనేత అయిన యాసిన్ భత్కల్ ను 12 రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇతనితో పాటు దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో మరో నిందితుడైన అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ అలియాస్ ‘హడ్డి’కి కూడా కోర్టు కస్టడీకి అప్పగించింది. రాష్ర్ట రాజధాని హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో గత ఫిబ్రవరిలో జరిగిన బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ ఎట్టకేలకు గురువారం ఇంటెలిజెన్స్ అధికారులకు చిక్కాడు. ఇప్పటి వరకూ వరుస దాడులకు దిగుతూ ప్రభుత్వానికి కంటి మీద కునుకులేకుండా చేసిన భత్కల్ భారత్ -నేపాల్ సరిహద్దులో దొరకడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.  యాసిన్‌పై రూ.35 లక్షల రివార్డు ఉంది.

 

పలుమార్లు దొరికినట్టే దొరికి చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్న ఇతని కోసం గత ఐదేళ్లుగా గాలింపు కొనసాగుతోంది. ఇతనితో పాటు దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో మరో నిందితుడైన అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ అలియాస్ ‘హడ్డి’ని కూడా బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకువచ్చి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులకు అప్పగించారు..

మరిన్ని వార్తలు