యాసిన్ భత్కల్ను ఎన్కౌంటర్ చేస్తారేమో!

6 Jul, 2015 12:48 IST|Sakshi
యాసిన్ భత్కల్ను ఎన్కౌంటర్ చేస్తారేమో!

భత్కల్ (ఉత్తరాఖండ్): విచారణా ఖైదీగా ఉంటూ పోలీసుల చేతిలో హతమైన సిమీ ముఖ్య నాయకుడు వికారుద్దీన్లానే ఇండియన్ ముజాహిద్దీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ఎన్కౌంటర్కు బలికానున్నాడా? నేరం నిరూపణ కాకముందే అతడ్ని మట్టుబెట్టేందుకు పోలీసులు పథకం పన్నారా? అంటే అవుననే అంటోంది భత్కల్ తల్లి రిహానా సిద్దిబా!

ప్రస్తుతం చర్లపల్లి కేంద్ర కరాగారంలో విచారణ ఖైదీగా ఉన్న భత్కల్.. 'ఐఎస్ఐఎస్ సహకారంతో జైలు నుంచి బయటికొస్తా' అని తల్లి, భార్యలతో ఫోన్లో చెప్పినట్లు వెలుగుచూసిన వార్తలు సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. అయితే అసలు యాసిన్ తమతో అలా మాట్లాడనేలేదని రిహానా చెబుతున్నారు. సొంత ఊరు ఉత్తరాఖండ్లోని భత్కల్లో సోమవారం ఆమె విలేకరులతో మాట్టాడారు.

'నా కొడుకుతో చాలాసార్లు ఫోన్లో మాట్లాడా. దమస్కస్ నుంచి ఎవరో వచ్చి జైలు నుంచి బయలకు తీసుకొస్తారనే సంభాషణలేవీ మా మధ్య జరగలేదు. నిజానికి పోలీసుల నుంచి తనకు ప్రాణహాని ఉందని భత్కల్ మాతో అన్నాడు. వాడు అనని మాటల్ని అన్నట్లుగా ప్రచారం చేయడం చూస్తోంటే నా కొడుకును పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారేమోననే అనుమానం మరింత బలపడుతోంది' అని రిహానా చెప్పారు. భత్కల్పై మోపిన అభియోగాలన్నీ నిరాధారమైనవేనన్న ఆమె.. హై సెక్యూరిటీ జైలు నుంచి తప్పించుకోవడం ఎవరికైనా ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు