యోగికి దళిత మిత్ర వద్దన్నందుకు అరెస్ట్‌

14 Apr, 2018 16:06 IST|Sakshi
ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (ఫైల్‌ ఫొటో)

లక్నో : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్‌ మహాసభ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు దళిత మిత్ర అవార్డు అందజేసింది. దళితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న యోగికి ఈ అవార్డు ఇవ్వడమేమిటంటూ నిరసన వ్యక్తం చేసిన దళిత కార్యకర్తలు ఎస్‌ఆర్‌ దారాపురి, హరీశ్‌ చంద్ర, గజోదర్‌ ప్రసాద్‌, చౌరాసియాలను పోలీసులు అరెస్టు చేశారు. వీరు కూడా అంబేద్కర్‌ మహాసభ సభ్యులు కావడం గమనార్హం.

ఏ ప్రాతిపదికన అవార్డు ఇచ్చారు..?
యోగి ఆదిత్యనాథ్‌కు దళిత మిత్ర అవార్డు అందజేయడం వల్ల అంబేద్కర్‌ మహాసభ సభ్యుల మధ్య విభేదాలు చెలరేగాయి. సభ్యులందరినీ సంప్రదించకుండానే  అధ్యక్షుడు లాల్జీ నిర్మల్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మాజీ ఐపీఎస్‌ అధికారి, మహాసభ సభ్యుడు ఎస్‌ఆర్‌ దారాపురి ఆరోపించారు. యోగి ఈ అవార్డుకు అనర్హులంటూ మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి రాయితీలు పొందేందుకే లాల్జీ నిర్మల్‌.. యోగిని ఈ అవార్డుకు ఎంపిక చేశారని ఆరోపణలు చేశారు.

30 కోట్ల మందికి బ్యాంకు అకౌంట్లు : యోగి
గవర్నర్‌ రామ్‌నాయక్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్న అనంతరం యోగి ప్రసంగించారు. మోదీ సర్కారు దళితుల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. 30 కోట్ల మంది దళితులకు బ్యాంకు అకౌంట్లు తెరిచే అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. బాబా సాహెబ్‌ ఆశయాలను పాటిస్తూ ఆయన గౌరవాన్ని పెంపొందిస్తున్న ఏకైక వ్యక్తి మోదీ అంటూ ప్రశంసలు కురిపించారు. అంబేద్కర్‌ మహాసభ అధ్యక్షుడు లాల్జీ నిర్మల్‌ మాట్లాడుతూ..దళితుల కోసం యోగి ఎంతో కృషి చేస్తున్నారన్నారు.

మరిన్ని వార్తలు