సీఎం ఇఫ్తార్ విందు ఇవ్వరా?

5 Jun, 2017 08:15 IST|Sakshi
సీఎం ఇఫ్తార్ విందు ఇవ్వరా?

రంజాన్ మాసం వచ్చిందంటే ముఖ్యమంత్రులు తమ అధికారిక నివాసాల్లో ఇఫ్తార్ విందులు ఇవ్వడం సర్వసాధారణం. బీజేపీ అగ్రనేతలు అటల్ బిహారీ వాజ్‌పేయి, రాజ్‌నాథ్ సింగ్, కళ్యాణ్ సింగ్ లాంటి వాళ్లు కూడా ఇలా ఇఫ్తార్ విందులు ఇచ్చారు. కానీ, ప్రస్తుతం విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం ఈ సంప్రదాయాన్ని పాటించకపోవచ్చని అంటున్నారు. ఈసారి 5 కాళిదాస్ మార్గ్‌లోని ఆయన అధికారిక నివాసంలో ఇఫ్తార్ విందు ఉండకపోవచ్చట. ఒకవేళ నిజంగానే ఆయన అలా చేస్తే.. ఇఫ్తార్ విందు ఇవ్వకుండా మానేసిన రెండో బీజేపీ ముఖ్యమంత్రి అవుతారు. ఇంతకుముందు రామ్ ప్రకాష్ గుప్తా ఇలాగే ఇఫ్తార్ ఇవ్వలేదు. అలాగే.. నరేంద్రమోదీ కూడా ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటివరకు ఇఫ్తార్ విందులు ఏవీ ఏర్పాటు చేయలేదు.

ఏప్రిల్ నెలలో చైత్ర నవరాత్రి సందర్భంగా బీజేపీ నేతలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక ఫలహార విందు ఏర్పాటుచేశారు. అయితే ఇప్పుడు ఇఫ్తార్ విందు మాత్రం ఇవ్వకపోవడం ఏంటని ముస్లిం పెద్దలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్ సింగ్, రాజ్‌నాథ్ లాంటి వాళ్లు కూడా ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఇఫ్తార్ విందులు ఇచ్చారని, దేశంలో లౌకిక వాదాన్ని కాపాడేందుకే వారలా చేశారని సున్నీ ముస్లిం మతపెద్ద, ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు సభ్యుడు ఖాలిద్ రసీద్ ఫిరంగీ మహాలీ అన్నారు.

ముఖ్యమంత్రి ఇచ్చినా ఇవ్వకపోయినా.. దాంతో సంబంధం లేకుండా తాము మాత్రం ఇఫ్తార్ విందులు ఇస్తామని ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగం రాష్ట్రీయ ముస్లిం మంచ్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఆవు పాల నుంచి వచ్చిన ఉత్పత్తులతో రంజాన్ ఉపవాస దీక్షలను విరమింపజేస్తామని అంటున్నారు. రంజాన్ మాసంలో రోజంతా ఉపవాసం ఉన్న తర్వాత ముస్లింలు తినే భోజనాన్నే ఇఫ్తార్ అంటారు.

మరిన్ని వార్తలు