15ఏళ్లలో సీఎం పర్యటన ఇదే తొలిసారి

31 May, 2017 16:22 IST|Sakshi
రామ్‌ లాల్లా ఆలయంలో యోగి పూజలు

అయోధ్య : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ బుధవారం అయోధ్యలో పర్యటించారు. వివాదాస్పద రామ్‌జన్మస్థల్‌లో తాత్కాలికంగా నిర్మించిన రామ్‌ లాల్లా ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత  పవిత్ర సరయూ నదీతీరాన్ని పరిశీలించారు. అంతకుముందు నగరంలోని హనుమాన్‌ గర్హ్‌ ఆలయాన్ని కూడా యోగి దర్శించుకున్నారు.

ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యోగి పాస్‌పోర్టు కార్యాలయాన్ని ప్రారంభించిన ఆ తర్వాత జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు సీఎం తన పర్యటన ముగించుకుని లక్నో బయల్దేరి వెళతారు. కాగా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో  రామజన్మభూమి ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.

ఇక యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక యోగి ఆదిత్యనాథ్‌ అయోధ్యలో పర్యటించడం ఇదే ప్రథమం. అలాగే ముఖ్యమంత్రి హోదాలో  అయోధ్యలో పర్యటించడం గత 15ఏళ్లలో ఇదే తొలిసారి. అలాగే బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ అగ్రనేతలపై లక్నో సీబీఐ కోర్టు కుట్ర అభియోగలు నమోదు చేసిన తెల్లారే... ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అయోధ్యలో పర్యటించడం విశేషం.

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వానీ, జోషి, ఉమాభారతిపై కుట్ర అభియోగాలను ఖరారు చేసిన సీబీఐ కోర్టు వారికి మంగళవారం బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రామజన్మభూమి ఆలయాన్ని సీఎం​ యోగి సందర్శిస్తుండటంతో ఈ అంశానికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.  6 డిసెంబర్ 1992న  ఉత్తరప్రదేశ్‌లో అతి పురాతనమైన బాబ్రీ మసీదును నేలమట్టం అయిన విషయం విదితమే.

>
మరిన్ని వార్తలు