చిన్నోడే పెద్దోడట!

7 Oct, 2015 07:25 IST|Sakshi

పట్నా: ఎన్నికల పుణ్యమా అని అన్న తమ్ముడు అయ్యాడు, తమ్ముడు అన్నయ్యాడు! బిహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆర్జేడీ చీఫ్ లాలూ తనయుల ఉదంతం ఇది. లాలూ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్(25) సోమవారం వైశాలి జిల్లాలోని రఘోపూర్ స్థానానికి నామినేషన్ వేశా డు. చిన్న కొడుకు తేజస్వీ ప్రసాద్ కూడా అదే జిల్లాలోని మహువాకి నామినేషన్ వేశారు. అయితే తేజస్వి తన వయసు 26గా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తేజస్వి తన వయసును అన్నకంటే ఏడాది ఎక్కువగా చెప్పడంతో వివా దం రేగింది. అన్నదమ్ములిద్దరి అఫిడవిట్లపై దర్యాప్తు జరపాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. లాలూ, ఆయన తనయులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ‘ఓటరు గుర్తింపు కార్డు ల్లో ఉన్నదే అంతిమం.  వాటిలో ఉన్న వయసునేవారు పేర్కొన్నారు’ అని లాలూ అన్నారు.  
 
 మతవిద్వేషాలతో చెడగొట్టే యత్నం
 బిహార్‌లో వాతావరణాన్ని మతద్వేషాలతో చెడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మాహా కూటమి నేతలైన సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్‌లు ధ్వజమెత్తారు.
 
 ‘కుక్కలు పెంచేవాళ్లు..’: ఓటమి భయంతో బీజేపీ మత ఎజెండా అనుసరిస్తోందని లాలూ విమర్శించారు.‘కుక్కలు పెంచేవారు ఆవును పెంచేవారికి పాఠాలు చెప్పొద్దు.  గోమాత గురించి మాట్లాడే వారిని వారిలో ఎందరికి గోశాలలు ఉన్నాయని ప్రశ్నించాలి. మా గోశాలల్లో వంద నుంచి 500 ఆవులు ఉన్నాయి’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.
 
 లాలూ, అమిత్‌షాలపై కేసులు
 మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను నరమాంస భక్షకుడు అన్నందుకు లాలూపై, లాలూను గడ్డి దొంగ అని అన్నందుకు అమిత్‌షాపై కేసులు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు