యువ సర్పంచ్‌.. దేశానికే ఆదర్శం..

13 Aug, 2018 23:03 IST|Sakshi

రెండేళ్లక్రితం సర్పంచ్‌గా పదవి చేపట్టినప్పుడు ఆమె వయసు 22. దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన సర్పంచ్‌గా నిలిచారు. అభివృద్ధి పనులు చేపట్టేందుకు అనుభవంకన్నా, అంకితభావం ముఖ్యమని నిరూపించారు. సర్పంచ్‌గా గ్రామానికి అందిస్తున్న సేవలకుగాను ఇటీవల తన జిల్లాలో అవార్డు కూడా అందుకుని ఇతర సర్పంచులకు ఆదర్శంగా నిలిచారు.

సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్, మండి జిల్లాలోని చిన్న గ్రామం తజున్‌. 2016 జూన్‌లో 22 ఏళ్ల వయసులో ఆ గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికైంది జబ్నా చౌహాన్‌.  నిజానికి జబ్నాది చాలా పేద కుటుంబం. తండ్రి వ్యవసాయం చేసేవాడు. ఆయనకు మరో కూతురు, అంధుడైన కొడుకు ఉన్నాడు. వ్యవసాయం ద్వారా వచ్చే తక్కువ ఆదాయంతోనే కుటుంబపోషణ చేయాల్సిన పరిస్థితి. దీంతో జబ్నాను ఆ ఊళ్లో ఇంటర్‌ వరకే చదివించాడు. అయితే తండ్రి సోదరుడు జబ్నాను డిగ్రీ చదివేంచేందుకు ముందుకు వచ్చాడు.

సమస్యలపై అవగాహన..: తన కుటుంబ పరిస్థితి తెలిసిన జబ్నా ఓ వైపు చదువు కొనసాగిస్తూనే, మరోవైపు జర్నలిస్టు (స్ట్రింగర్‌)గా పనిచేసేవారు. ఈ సమయంలో గ్రామంతోపాటు చుట్టుపక్కల ఉన్న ఊళ్ల సమస్యలపై అవగాహన పెంచుకున్నారు. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్తూ, పరిష్కారం కోసం కృషి చేసింది. దీంతో 2016 జూన్‌లో జరిగిన ఎన్నికల్లో జబ్నాను సర్పంచ్‌గా పోటీ చేయమని గ్రామస్తులు సూచించడంతో ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.

మద్యపాన నిషేధం.. : సర్పంచ్‌గా ఎన్నిక కాగానే గ్రామంలో మద్యపాన సమస్యపై దృష్టిసారించారు. మద్యపానం వల్ల గ్రామంలో మహిళలు పడుతున్న ఇబ్బందుల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి, మద్యం షాపుల్ని మూసివేయించారు. ఈ క్రమంలో స్థానికుల నుంచి ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నారు. అలాగే వ్యర్థాల నిర్వహణ, రోడ్ల ఏర్పాటు వంటి పనులు చేపడుతూ రెండేళ్ల పదవీకాలంలోనే గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు. తనలా ఉన్నత విద్యకు ఎవరూ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో గ్రామంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని జబ్నా తెలిపారు.  

మరిన్ని వార్తలు