హనుమంతుడు కలలో కనిపించాడంటూ దారుణం.. ముగ్గురి బలి

30 Nov, 2013 20:57 IST|Sakshi

మూఢ భక్తో.. మూర్ఖత్వమో  లేక ఇతర కారణమో కానీ హర్యానా రాష్ట్రంలో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. హనుమంతుడు కలలో కనిపించి తన జీవితం చివరి దశకు చేరుకుందని చెప్పాడని, తానిక బతకడనే కలతతో భార్య, ఇద్దరు కూతుళ్లను బాకుతో పొడిచి కిరాతకంగా చంపేశాడు. అనంతరం తానూ పొడుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

రేవరికి 20 కి.మీ దూరంలోని రాజ్గఢ్ గ్రామంలో మనోజ్ కుమార్ (26) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి ఈ దారుణానికి పాల్పడ్డాడు. అతని భార్య సరితా దేవి (23), రెండు, పది నెలల వయసు గల ఇద్దరు కూతుళ్లను హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మనోజ్ పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలావుండగా, సరితాదేవి సోదరుడు కట్నం కోసమే హత్య చేశాడంటూ మనోజ్పై కేసు పెట్టాడు. పోలీసులు హత్య, వరకట్న వేధింపుల కేసులు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు