యువత తగ్గుముఖం!

4 Jul, 2019 22:38 IST|Sakshi

2041 నాటికి దేశ జనాభాలో 16 శాతం వయోవృద్ధులే 

41నుంచి 25 శాతానికి పడిపోనున్న బాలలు, యువత సంఖ్య 

వర్కింగ్‌ ఏజ్‌ గ్రూప్‌ నిలకడగా ఉంటుందని ఆర్థిక సర్వే వెల్లడి 

 సాక్షి, న్యూఢిల్లీ: సంతానోత్పత్తి రేటు(టీఎఫ్‌ఆర్‌) తగ్గుముఖం పడుతుండడంతో దేశ జనాభాలో చిన్నారులు, యువత శాతం తగ్గుముఖం పట్టి.. వృద్ధుల సంఖ్య రెట్టింపు కానుందని ఆర్థిక సర్వే విశ్లేషించింది. వర్కింగ్‌ ఏజ్‌ గ్రూప్‌ జనాభాలో 59 శాతం వరకూ ఉండనుందని వివిధ గణాంకాల ఆధారంగా విశ్లేషించింది. టీఎఫ్‌ఆర్‌ తగ్గుతుండడంతో మొత్తం జనాభాలో 0 నుంచి 19 ఏళ్ల వయస్సు మధ్య గల జనాభా తగ్గుతుందని ఆర్థిక సర్వే పేర్కొంది. 2011లో  41 శాతం ఉన్న ఈ గ్రూపు జనాభా.. 2041 నాటికి 25 శాతానికి పడిపోతుందని తెలిపింది. అలాగే 60 ఏళ్లు పైబడిన జనాభా గ్రూపు పెరుగుతుందని వివరించింది. 2011లో వీరు 8.6 శాతం ఉండగా.. 2041 నాటికి 16 శాతానికి పెరగనుంది. 20 నుంచి 59 మధ్య ఉండే వర్కింగ్‌ గ్రూప్‌ జనాభా.. 2041లో కూడా 59 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

పెరిగిన లింగనిష్పత్తి
బేటీ బచావో బేటీ పడావో పథకం ప్రారంభించిన తరువాత ఆంధ్రప్రదేశ్‌ సహా పలు పెద్ద రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి గణనీయంగా పెరిగిందని ఎకనమిక్‌ సర్వే వెల్లడించింది. అంతకుముందు 2001 నుంచి 2011 వరకు లింగ నిష్పత్తి తగ్గగా.. ఈ పథకం ప్రారంభమయ్యాక లింగ నిష్పత్తిలో మార్పు వచ్చిందని తెలిపింది. 2015–16లో ఏపీలో లింగ నిష్పత్తి 873 నుంచి 901 మధ్య ఉండగా.. 2018–19 నాటికి 930–980 నమోదైంది. మరోవైపు తెలంగాణలోనూ లింగనిష్పత్తిలో గణనీయమైన పెరుగుదల నమోదైందని నివేదికలో వెల్లడించింది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు