జల్లికట్టు కోసం రగులుతున్న తమిళనాడు

17 Jan, 2017 22:31 IST|Sakshi
జల్లికట్టు కోసం రగులుతున్న తమిళనాడు

చెన్నై: జల్లికట్టు క్రీడను నిర్వహించుకోవడానికి అనుమతి రాకపోవడంతో తమిళనాడు ప్రజలు రగిలిపోతున్నారు. జల్లికట్టు నిర్వహణకు పర్మిషన్ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తోసిపుచ్చినప్పటినుంచీ తమిళనాడులో ఉద్రిక్త వాతావరణ చోటుచేసుకుంది. గత కొన్ని రోజులనుంచి యువత చేపట్టిన ఆందోళన ఉధృతమైంది. చెన్నై మెరీనా తీరానికి వేలాది మంది యువత చేరుకుని మెరీనా తీరాన్ని బ్లాక్ చేశారు. సీఎం పన్నీర్ సెల్వం వచ్చి హామీ ఇచ్చేంతవరకు ఇక్కడినుంచి కదిలేది లేదంటూ రోడ్డుపై బైఠాయించారు.

ఆందోళనకారులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వేలాదిగా యువత మెరీనా తీరానికి చేరుకుని తమ ఆందోళనను మరింత ఉధృతం చేయడంతో తమిళనాడు సర్కార్ చేతులెత్తేసింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా మధ్యంత ఉత్తర్వులు ఇవ్వాలన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ‘జల్లికట్టు’ని నిషేధించాలి’’ అని ఇటీవల తన ట్విట్టర్‌లో త్రిష పేర్కొనడంతో ఆమెపై తమిళ ప్రజలు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. హీరో సూర్య మాత్రం జల్లికట్టుకు పూర్తిగా మద్ధతు తెలిపాడు. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ఈ సాహస క్రీడ తప్పకుండా ప్రతిఏటా నిర్వహించాల్సిందే అంటూ ఆందోళన చేపట్టిన యువత వెనక్కి తగ్గడం లేదు. మెరీనా తీరాన్ని బ్లాక్ చేసి తమ నిరసన తెలిపారు.
(చదవండి: సుప్రీంకోర్టులో తమిళనాడుకు చుక్కెదురు)

మరిన్ని వార్తలు