హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి

11 May, 2017 01:05 IST|Sakshi
హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి

ప్రధానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి
- పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ అది
- ప్రలోభాలతో ఫిరాయింపులు.. మంత్రి పదవులు
- ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు..
- మిర్చి రైతులను ఆదుకోవాలి..
- అగ్రిగోల్డ్‌పై సీబీఐ విచారణ జరిపించాలి


సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించే విషయమై పునరాలోచన చేయాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చారు.. బీజేపీ మేనిఫెస్టోలో పెట్టారు.. మీరు తిరుపతి ఎన్నికల సభలో మాటిచ్చారు..’ అని ప్రధానికి జగన్‌ గుర్తుచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావలసిందేనన్న రాష్ట్రప్రజల ఆకాంక్షను ప్రధానికి తెలియజేశారు. హోదా లేనిదే రాష్ట్రం అభివృద్ధి సాధ్యం కాదని మోదీకి జగన్‌ వివరించారు.

బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు విజయసాయిరెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి, వై.ఎస్‌.అవినాష్‌రెడ్డితో పాటు ఇక్కడి ప్రధాని నివాసంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నవైనాన్ని వివరించడంతో పాటు ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేశ్‌పై ఆరోపణలు వస్తున్న అగ్రిగోల్డ్‌ కుంభకోణంపై సీబీఐ విచారణ వేయాలని, మిర్చి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానిని కలసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జగన్‌ ఏమన్నాంరంటే..

అగ్రిగోల్డ్‌పై సీబీఐ విచారణ జరిపించాలి..
‘‘ప్రధాన మంత్రిని మొన్న వచ్చినప్పుడు అపాయింట్‌మెంట్‌ అడిగాం. ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు అనైతికంగా ప్రలోభాలు పెట్టి డబ్బులు ఇచ్చి తీసుకొని వారిని అనర్హత వేటు వేయకుండా.. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్న పరిస్థితులు, అంతటితో ఆగకుండా వాళ్లలో నలుగురుని ఏకంగా మంత్రి పదవులు ఇచ్చి కూడా ప్రలోభాలు పెడుతూ ఉంటే ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్టు కాదా అంటూ ఆనాడు రాష్ట్రపతి, మంత్రులు, వివిధ పార్టీల నాయకులను కలిసి వివరించాను. అందులోభాగంగా ప్రధాని అపాయింట్‌మెంట్‌ అడిగాం. నిన్న రాత్రి ప్రధాన మంత్రి అపాయింట్‌మెంట్‌ ఖరారవగా వచ్చాం.

ఈ అంశంతో పాటు మరికొన్ని అంశాలు ప్రధానికి వివరించాను. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేసే దిశగా బినామీ ఆస్తులను వెలికితీసి వేలంలోకి తీసుకురావాలని కోరాం. టీడీపీకి చెందిన మంత్రులు, ఎంపీలు, చంద్రబాబు కొడుకుపై కూడా ఆరోపణలు ఉన్నాయి. వారందరూ ఏవిధంగా బాధితులతో చెలగాటం ఆడుతున్నారనే విషయం చెబుతూ ఈ వేలం ప్రక్రియ కొనసాగిస్తూ సీబీఐ విచారణ వేయాలని కోరాం. అదేరకంగా మిర్చి రైతుల  విషయంలో ప్రధాన మంత్రి ముందుకు వచ్చి క్వింటాలుకు రూ. 5 వేలు ఇచ్చి ఆదుకోవడం హర్షించదగిన విషయమే అయినప్పటికీ.. రైతులు అవి సరిపోని పరిస్థితుల్లో ఉన్నారు.

ప్రధాన మంత్రి రూ. 5 వేలు ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి ముందుకు వచ్చి మరో రూ. 3 వేలు కలిపి కొనుగోళ్లు జరిపి రైతులను ఆదుకోవాల్సింది. కానీ అలా చేయకపోవడం వల్ల రైతులు అవస్థలు పడుతున్నారు. కాబట్టి మీరే పెద్ద మనసుతో రూ. 5 వేలను రూ. 8 వేలుగా చేయాలని కోరాం. 8 లక్షల క్వింటాళ్లను మాత్రమే కొంటామన్నారు. దానిని కనీసం 50 లక్షల క్వింటాళ్లకు.. అంటే ఉత్పత్తిలో కనీసం 50 శాతం వరకైనా కొనుగోలు చేయాలని కోరాం.

ప్రత్యేక హోదాపై పునరాలోచన చేయాలన్నాం..
ప్రత్యేక హోదా అనేది మర్చిపోలేని అంశం. రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు పార్లమెంటు సాక్షిగా ఈ హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ వంటి నగరం మాకు లేకుండా పోతోందన్నప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చారు. ఈరోజు చెన్నైతో కూడిన తమిళనాడుతో గానీ, బెంగళూరుతో కూడిన కర్ణాటకతో గానీ, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణతో గానీ పోటీ పడాలన్నా మౌలిక వసతులు లేకుండా సాధ్యం కానిపరిస్థితి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా కావాలి. పార్లమెంటులో మాటిచ్చారు. బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది. తిరుపతిలో మీరు కూడా హామీ ఇచ్చిన సంగతి మరిచిపోవద్దని మరోసారి గుర్తుచేశాం. ప్రత్యేక హోదా అంశం చంద్రబాబు నాయుడు అడక్కపోయినా, పక్కనపెట్టినా కూడా.. మేం మాత్రం మరిచిపోలేదు. గట్టిగా ముందుకు తీసుకుపోతాం. ప్రధానిని మరోసారి పునరాలోచన చేయాలని కోరాం. దీంతో వివిధ అంశాలపై అర్జీ ఇచ్చాం..’’అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు