వెల్‌లోకి దూసుకెళ్లిన వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు

6 Feb, 2018 12:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా నినాదాలతో లోక్‌సభ మంగళవారం దద్దరిల్లింది. విభజన హామీలు అమలు చేయాలంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు సభలో ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకు వెళ్లి నిరసన తెలుపుతున్నారు. సుమారు మూడు గంటల నుంచి ఎంపీలు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. విభజన హామీలపై స్పష్టమైన ప్రకటన వచ్చేవరకూ తమ ఆందోళన కొనసాగుతుందని ఎంపీలు స్పష్టం చేశారు. మరోవైపు టీడీపీ ఎంపీలు కూడా వెల్‌కు వచ్చి తమ నిరసన తెలిపారు. కాగా అంతకు ముందు వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు పార్లమెంట్‌ గేట్‌-1 వద్ద ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగిన విషయం తెలిసిందే. మరోవైపు పార్లమెంట్‌లో వైఎస్‌ఆర్‌ సీపీ, టీడీపీ ఎంపీల ఆందోళనపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌...ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు.

ఏపీకి అన్యాయంపై దద్దరిల్లుతున్న పార్లమెంట్‌
బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై పార్లమెంట్ దద్దరిల్లుతోంది. ఇవాళ ఉదయం లోక్‌ సభ ప్రారంభం కాగానే ప్రపంచ కప్‌ గెలిచిన భారత యువజట్టుకు సభ్యులు అభినందనలు తెలిపారు. తర్వాత స్పీకర్  ప్రశ్నత్తరాలు చేపట్టగా... వైఎస్ఆర్‌ సీపీ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. 184వ నిబంధన కింద చర్చ కోసం ఇచ్చిన నోటీసుతోపాటు వాయిదా తీర్మానాన్ని సభాపతి తిరస్కరించడంపై నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలతో హోరెత్తించారు.

ఇతర విపక్షాలు కూడా వివిధ అంశాలపై ఆందోళన చేపట్టాయి. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. పదే పదే విజ్ఞప్తిచేసినా సభ్యులు పట్టువీడకపోవడంతో సభాపతి సమావేశాలను కాసేపు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభం అయినా వైఎస్‌ఆర్‌ సీపీ తన పట్టు వీడలేదు. వైఎస్ఆర్‌ సీపీ ఎంపీలతోపాటు టీడీపీ ఎంపీలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన కొనసాగిస్తున్నారు. అటు రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సభ ప్రారంభం కానే విపక్షాలు ఆందోళనకు దిగడంతో చైర్మన్ వెంకయ్య నాయుడు రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా గందరగోళం కొనసాగడంతో సమావేశాలు మధ్యాహ్నం మూడు గంటల వరకూ వాయిదా పడ్డాయి.

టీడీపీ డ్రామాలో మరో ట్విస్ట్‌
పార్లమెంట్‌ సాక్షిగా టీడీపీ ద‍్వంద్వ వైఖరి మరోసారి బయటపడింది. ఓ వైపు రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ లోక్‌సభలో ఎంపీలు నిరసనకు దిగితే... మరోవైపు బడ్జెట్‌ అద్భుతమంటూ టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ రాజ్యసభలో ప్రశంసలు కురిపించారు. దీంతో టీడీపీ ఎంపీల డ్రామాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంట్‌ బయట ఆందోళన చేస్తూ, లోపల ప్రభుత్వాన్ని పొగుడుతారా అంటూ టీడీపీపై విమర్శలు వస్తున్నాయి. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు నిరసన చేపట్టిన విషయం విదితమే.

>
మరిన్ని వార్తలు