ప్రధాని మోదీతో నేడు వైఎస్‌ జగన్‌ భేటీ

26 May, 2019 04:39 IST|Sakshi
నరేంద్ర మోదీ, వైఎస్‌ జగన్‌(పాత చిత్రం)

తన ప్రమాణ స్వీకార ఆహ్వాన పత్రికను మోదీకి అందజేయనున్న జగన్‌ 

మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న మోదీకి జగన్‌ అభినందనలు

ఏపీ భవన్‌లో వైఎస్‌ జగన్‌ను కలవనున్న ఏపీ కేడర్‌ ఐఏఎస్‌లు  

సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు.  ఆదివారం ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసం 7, లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్‌ జగన్‌ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసి, మళ్లీ ఢిల్లీ పీఠాన్ని అధిష్టించినందుకు మోదీకి శుభాకాంక్షలు తెలపనున్నారు.

ఈ సందర్భంగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా మోదీకి ఆహ్వాన పత్రికను అందించనున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా హస్తినకు వెళ్తారు. రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, తాజా ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, బాలశౌరి, నందిగం సురేష్, మార్గాని భరత్‌ తదితరులు కూడా జగన్‌ వెంట ఉంటారని సమాచారం. మోదీతో భేటీ అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్‌ జగన్‌ ఏపీ భవన్‌కు చేరుకుంటారు. అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్‌కు జగన్‌ వెళ్తారు. అక్కడ జగన్‌ను ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలపనున్నారు. 

మరిన్ని వార్తలు