సరోగసీ బిల్లుకు వైఎస్సార్‌ సీపీ మద్దతు

20 Nov, 2019 18:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సరోగసీ (అద్దె గర్భం) నియంత్రణ బిల్లు, 2019కి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించింది. రాజ్యసభలో బుధవారం ఈ బిల్లుపై జరిగిన చర్చలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, నియంత్రణ లేమి కారణంగా దేశంలో సరోగసీ ఒక పరిశ్రమలాగా విస్తరిస్తూ  అద్దె గర్భాలకు అంతర్జాతీయ గమ్యస్థానంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టబద్దమైన నియంత్రణ లేని కారణంగా విదేశీయులు నిరుపేద భారతీయ మహిళలకు డబ్బు ఆశ చూపి వారిని గర్భం అద్దెకు ఇచ్చే తల్లుల మాదిరిగా మారుస్తున్నారు. ఇది చాలా ఆందోళనకర పరిణామం. అందుకే ఈ బిల్లుకు తమ పార్టీ తరఫున మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన చెప్పారు.

 విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా బిల్లును పటిష్టంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కొన్ని సూచనలను ప్రభుత్వానికి చేశారు. బిల్లులో పేర్కొన్న వంధ్యత్వం అనే మాటకు నిర్వచనం చాలా అస్పష్టంగా ఉందన్నారు. ఒక మహిళ గర్భం దాల్చగలిగినా బిడ్డను ప్రసవించలేక తరచుగా గర్భస్రావం జరిగే ఆమె వైద్య స్థితిని, అలాగే గర్భధారణకు చేటు కలిగించే హైపర్‌టెన్షన్‌, డయాబెటిస్‌ వంటి జబ్బులతో బాధపడే పరిస్థితిని విస్పష్టంగా ఈ బిల్లులో నిర్వచించలేదని అన్నారు. దక్షిణాఫ్రికా, నెథర్లాండ్స్‌, గ్రీస్‌ ఇంకా ఇతర దేశాలలో పైన వివరించిన వైద్య సమస్యలతో బాధపడేవారికి సరోగసీకి అనుమతిస్తారని ఆయన తెలిపారు. 

అలాగే బిల్లులోని క్లాజ్‌ 4లో పేర్కొన్న విధంగా సరోగసీకి అనుమతి పొందడానికి ఒక జంట ఎస్సెన్షియాలిటీ సర్టిఫికెట్‌, ఎలిజిబులిటీ సర్టిఫికెట్‌ పొందాలన్న షరతు విధించడం జరిగింది. అయితే అలాంటి సర్టిఫికెట్‌ జారీకి అధికారులు నిరాకరించిన పక్షంలో అప్పీల్‌ కోసం ఎవరి వద్దకు వెళ్ళాలో ఈ క్లాజ్‌లో వివరించలేదని శ్రీ వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. దీని వలన ఒకసారి సరోగసీ దరఖాస్తు తిరస్కరణకు గురైతే వారికి శాశ్వతంగా తలుపులు మూసినట్లేనని అన్నారు. కాబట్టి దరఖాస్తు సమీక్ష చేయడానికి అవకాశం కల్పించే క్లాజ్‌ను బిల్లులో పొందుపరచాలని కోరారు.

మరిన్ని వార్తలు