‘భద్రంగా పెట్టమని రూ.148.9 కోట్లిచ్చాడు’

1 May, 2017 11:39 IST|Sakshi
‘భద్రంగా పెట్టమని రూ.148.9 కోట్లిచ్చాడు’

ముంబయి: ఇస్లామిక్‌ మత వివాదాస్పద మత ప్రచారకుడు జకీర్‌ నాయక్‌ కేసులో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తన దగ్గర భద్రంగా పెట్టమని రూ.148.9కోట్లను జకీర్‌ ఇచ్చినట్లు ఆయన కీలక సహచరుడు, వ్యాపార భాగస్వామి ఆమిర్‌ అబ్దుల్‌ మన్నన్‌ గజ్దార్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులకు తెలియజేశారు. జకీర్‌ నాయక్‌ మేనేజర్‌ అస్లామ్‌ ఖురేషి తనకు ఈ మొత్తం ఇచ్చినట్లు తెలిపారు. మత ప్రచారం పేరిట జకీర్‌ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతోపాటు అక్రమంగా డబ్బు సంపాధించాడని ఆయనపైనా, ఆయన సంస్థ ఇస్లామిక్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌(ఐఆర్‌ఎఫ్‌)పైనా కేసు నమోదుచేసిన ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

అందులో భాగంగా ఆమిర్‌ను తాజాగా అదుపులోకి తీసుకొని విచారించగా ఈ విషయాలు వెల్లడించాడు. ఆగస్టు నుంచి అక్టోబర్‌ 2016 మధ్య ఈ మొత్తం డబ్బును తనకు ఇచ్చినట్లు తెలిపాడు. దఫాల వారీగా ఈ నగదును తీసుకెళతానని చెప్పినట్లు వివరించాడు. జకీర్‌పై ఎప్పుడైతే నిఘా అధికారుల కన్ను పడిందో ఆ సమయంలోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు పేర్కొన్నాడు. జకీర్‌ నాయక్‌కు చెందిన కంపెనీల్లో ఆమిర్‌కు ఒక దానిలో 5శాతం వాటా ఉండగా మరోదాంట్లో 50శాతం వాటా ఉంది. అంతేకాదు, ఇతడు ఐఆర్‌ఎఫ్‌లో ట్రస్టీ కూడా.

మరిన్ని వార్తలు