తండ్రి అంత్యక్రియలకూ డుమ్మా

31 Oct, 2016 07:58 IST|Sakshi
తండ్రి అంత్యక్రియలకూ డుమ్మా
భారతదేశానికి వస్తే పోలీసులు తనను ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయంతో.. తన తండ్రి అంత్యక్రియలకు సైతం జకీర్ నాయక్ డుమ్మా కొట్టారు. జకీర్ తండ్రి డాక్టర్ అబ్దుల్ కరీం నాయక్ (88) ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని ఓ ఆస్పత్రిలో మరణించారు. ప్రస్తుతం మలేసియాలో ఉన్నారని భావిస్తున్న జకీర్ నాయక్.. తన తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. నాయక్ తండ్రి బాంబే సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షుడు. ప్రస్తుతానికి నాయక్‌పై ఎఫ్ఐఆర్ ఏదీ దాఖలు కాకపోయినా.. కేంద్రం మాత్రం ఆయనకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను చట్ట విరుద్ధ సంస్థగా ప్రకటించాలని యోచిస్తోంది. నాయక్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని, ఆయనపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆయన నడిపించే పీస్ టీవీ మతపరమైన కార్యక్రమాలనే ప్రసారం చేస్తూ.. మత విద్వేషాలను రెచ్చగొడుతోందని అంటున్నారు
 
మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతంలో జన్మించిన జకీర్ తండ్రి డాక్టర్ అబ్దుల్ కరీమ్ మంచి వైద్యుడిగాను, విద్యావేత్తగాను పేరొందారు. ఆయనను కొన్ని రోజుల క్రితం మజ్‌గావ్‌లోని ప్రిన్స్ అలీఖాన్ ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు గుండె ఆగిపోవడంతో ఆదివారం తెల్లవారుజామను 3.30 గంటల సమయంలో మరణించినట్లు ప్రకటించారు. ఆయన అంత్యక్రియలకు భారీ మొత్తంలో జనం హాజరయ్యారు. పలువురు న్యాయవాదులు, వైద్యులు, రాజకీయ నాయకులు, పాత్రికేయులు, వ్యాపారవేత్తలు వచ్చారు. కానీ జకీర్ నాయక్ మాత్రం.. భారతదేశానికి వస్తే తనను పోలీసులు అరెస్టుచేస్తారన్న భయంతో రాకుండా ఆగిపోయారు. సిటీ క్రైం బ్రాంచికి చెందిన పోలీసులు, జాతీయ నిఘాసంస్థ అధికారులు, స్థానిక పోలీసులు కూడా జకీర్ కోసం అంత్యక్రియలు జరిగిన ప్రాంతం చుట్టూ గాలిస్తూ కనిపించారు. 
మరిన్ని వార్తలు