జికా.. వస్తోంది జర జాగ్రత్త!

12 Sep, 2016 01:25 IST|Sakshi
జికా.. వస్తోంది జర జాగ్రత్త!

భారత్‌ను హెచ్చరిస్తున్న డబ్ల్యూహెచ్‌వో
 డెంగీ, చికెన్‌గున్యాకు కారణమయ్యే
 ‘ఏడిస్’ దోమ ద్వారా వైరస్ వ్యాప్తి
 దేశంలో ఇప్పటికే డెంగీ స్వైరవిహారం
 64 ఏళ్ల కిందటే పుణేలో బయటపడ్డ జికా ఆనవాళ్లు
 నాటి నుంచి భారతీయుల్లో అంతర్లీనంగా వైరస్
 వైరస్ జన్యువులో మార్పులతో తాజాగా శక్తివంతం
 అందుకే అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు

 
 యాసీన్
దాదాపు ఏడాదిన్నర కిందట యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. చికిత్సే లేని మహమ్మారిగా మారి ఎన్నో ప్రాణాలను కబళించింది. మానవాళికే పెనుముప్పుగా పరిణమిస్తూ వైద్య రంగానికే కొత్త సవాల్ విసిరింది. వైద్య అత్యయిక పరిస్థితిని, ఎన్నో దేశాల మధ్య రవాణాను స్తంభింపజేసేంతటి ఉపద్రవాన్ని సృష్టించి ఆ తర్వాత కాస్త నెమ్మదించింది.. ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది! రెండో ఆగమనంలో రెట్టించిన శక్తితో విరుచుకుపడుతోంది. అదే ప్రాణాంతక జికా వైరస్. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజా పరిశోధనల్లో ఈ వైరస్ తీవ్రతను గుర్తించింది. ఇది ఏ క్షణంలోనైనా భారత్‌లోనూ వ్యాపించొచ్చని హెచ్చరిస్తోంది.
 
పొంచి ఉన్న ముప్పు...

భారత్‌కు ముప్పు పొంచి ఉందని డబ్ల్యూహెచ్‌వో విశ్వసనీయంగా చెప్పడానికి కారణాలున్నాయి. మన దేశంలోకి వచ్చే పర్యాటకులను డబ్ల్యూహెచ్‌వో నిశితంగా గమనిస్తోంది. ఏటా లక్షల సంఖ్యలో వచ్చే విదేశీ పర్యాటకుల వల్ల భారతీయులు ఈ వైరస్‌బారినపడే ప్రమాదం ఉందని చెబుతోంది. ‘ఏడిస్’ అనే దోమ ద్వారా జికా వైరస్ వ్యాపిస్తుంది.

డెంగీ, చికన్‌గున్యా వ్యాప్తికీ ఈ దోమే కారణం. ఇప్పటికే మన దేశంలో ఈ దోమ కుట్టడం వల్ల డెంగీ స్వైరవిహారం చేస్తోంది. ‘ఏడిస్’ విస్తృతి ఎక్కువగా ఉండటం వల్ల విదేశీ పర్యటకుల వల్ల ఒకవేళ జికా మన దేశానికి ఒకసారి గనక చేరితే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందనేది డబ్ల్యూహెచ్‌ఓ అంచనా.
 
అప్పట్లో డేంజర్ కాకపోవచ్చుగానీ ఇప్పుడైతే...
‘‘ఏడిస్ దోమ వ్యాపింపజేసే జికా వైరస్ మొదట్లో ఇంత తీవ్రంగా ఉండేది కాదు. పైగా ఆ వైరస్ సోకినప్పటికీ అప్పట్లో మెదడు కుంచించుకుపోవడం అనే లక్షణం కనిపించేది కాదు.  దాదాపు 64 ఏళ్ల క్రితం దీన్ని పుణెలో గుర్తించినప్పుడు అది ప్రమాదకరంకాని విధంగా (బినైన్‌గా) అంతర్లీనంగా భారతీయుల్లో ఉండేది.
 
1952లో జపనీస్ ఎన్‌సెఫలైటిస్ వంటి మెదడువాపు వ్యాధి జాడలను గుర్తించే క్రమంలో జికా వైరస్‌ను డబ్ల్యూహెచ్‌వో నిపుణులు కనుగొన్నారు. గతంలో ఉన్న వైరస్‌లో ‘ఎన్‌ఎస్1’అనే జన్యువులో వచ్చిన మ్యుటేషన్స్ వల్ల ఇప్పుడు అది మానవుల్లో నరాలను దెబ్బతీసే వ్యాధి (న్యూరోట్రోపిక్)గా మారింది.

ఈ ఉత్పరివర్తనం (మ్యూటేషన్) వల్ల రక్త కణాల్లో వైరస్ తన సంఖ్యను పెంచుకొని, వ్యాధి నిరోధక శక్తికి అతీతంగా వ్యవహరించే అవకాశం ఉంది. అందుకే భారత్‌లోని ప్రజలు ఈ వైరస్ బారిన పడే ప్రమాదం మరింత అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం’’ అని అమెరికాలోని హ్యూస్టన్‌లో ఉన్న బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ డీన్ పీటర్ హోటెజ్ పేర్కొన్నారు.
 
‘‘ఈ విషయమై భారత్‌ను వారం నుంచి హెచ్చరిస్తున్నామని, ఈ ముప్పును ఎట్టి పరిస్థితుల్లో అలక్షం చేయొద్దని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ), ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సరివియలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్‌పీ)లకు సూచించారు. ప్రజలు, ప్రభుత్వాలూ అప్రమత్తం కావాలని అయన కోరుతున్నారు. ‘‘తొలుత దీన్ని ఆఫ్రికాలో కనుగొన్నారు. ఆ తర్వాత యూరప్, మధ్యప్రాచ్యాలకు విస్తరించింది. గతేడాది బ్రెజిల్, అమెరికాపై దాడి చేసింది. ఇప్పుడు తూర్పు దేశాల దండెత్తి ప్రపంచమంతటికీ విస్తరించే పనిలో ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
 
భారత్‌కు ముప్పు ఎందుకంటే...
 దేశంలో జనసంఖ్య ఎక్కువ. ఆరోగ్యం, పారిశుద్ధ్యం వంటి అంశాలపై అవగాహన ఒకింత తక్కువ. పైగా ఇప్పుడు వర్షాకాలం. దాంతో నీళ్ల చేరికకు అవకాశం పెరిగి దోమలు మరింతగా వృద్ధి చెందే కాలం. ఇప్పుడు సింగపూర్ వంటి సమీప ప్రాంతాల్లోనూ దీని ఉనికి స్పష్టమైంది. ఇక దీని విస్తృతి ఉన్న దేశాల నుంచి పర్యాటకుల ప్రయాణాలు చాలా ఎక్కువ. అందునా జికాను వ్యాప్తి చేసే దోమ ఏడీస్ వల్లనే కలుగుతున్న డెంగ్యూ కేసులు చాలా ఎక్కువ. వీటన్నింటినీ చూస్తే భారత్‌లో ఇది విస్తరించడానికి అవసరమైన నేపథ్యం ఉంది. అందుకే హోటెజ్ వంటి వారు మరీ మరీ హెచ్చరిస్తున్నారు.
 
జికాను గుర్తించిందిలా... అది విస్తరించిందిలా...  
 ఉగాండా అడవుల్లోని రిసస్ కోతుల్లో 1947లో మొదటిసారి జికా వైరస్‌ను గుర్తించారు. ఏడేళ్ల తర్వాత నైజీరియా అడవుల్లోని మానవుల్లోనూ గుర్తించారు. 10 లక్షల ఇన్ఫెక్షన్ల తర్వాత అది మరింత శక్తిని పుంజుకోవడంతో మానవాళి అప్రమత్తమైంది. 2007లో పసిఫిక్ ద్వీపాల్లో వైరస్ కొత్త రూపం (స్టెయిన్స్) కనిపించింది. గతేడాది బ్రెజిల్‌లో దాదాపు 10 లక్షల కంటే ఎక్కువ మందిలో జికాను గుర్తించారు. ఇది సోకిన గర్భవతులకు కలిగిన సంతానంలో మెదడు సంకోచించి ఉండటాన్ని కనుగొన్నారు.
 
ఇలా మెదడు సంకోచించిపోవడాన్ని వైద్య పరిభాషలో ‘మైక్రో సెఫాలీ’ అంటారు. తల్లికి వ్యాధి సోకితే పుట్టే పిల్లల తల చాలా చిన్నదిగా ఉంటుంది. మెదడు అభివృద్ధి, వికాసం... ఈ రెండు అంశాలూ చాలా తక్కువ. ఇక ఆ తర్వాత అమెరికా ఖండంలోని 26 దేశాలకు ఇది పాకిందని తెలుసుకున్నారు.

అనంతరం ఆఫ్రికాలోని కేప్ వెర్డెలో, సింగపూర్‌లోనూ జికా కేసులను కనుగొన్నారు. కేవలం ఐదు రోజుల వ్యవధిలో 200 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయనే అంశం దీని విస్తృతి తీవ్రతను చెబుతుండగా... అదే తీవ్రత ప్రపంచాన్ని వణికిస్తోంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)తోపాటు అమెరికన్ నేషనల్ హెల్త్ ఏజెన్సీ చెప్పే లెక్కల ప్రకారం ప్రస్తుతం జికా వైరస్ 58 దేశాల్లో మృత్యుఘంటికలు మోగిస్తోంది. తాజాగా తమ దేశంలో జికాను గుర్తించినట్లు ఫిలిప్పిన్స్ ఈ నెల 5న ప్రకటించింది.
 
 ఇవీ లక్షణాలు...
 - జ్వరం
 - ఒంటి మీద దద్దుర్లు (ర్యాష్)
 - కళ్లు ఎర్రబడటం, కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు, తలనొప్పి
 - గర్భవతుల్లో పిండం మెదడు కుంచించుకుపోవచ్చు, మిగతా వారిలో ఒళ్లు చచ్చుబడే గులియన్ బ్యారీ సిండ్రోమ్ (జీబీఎస్) రావొచ్చు
 
 జాగ్రత్తలు...
 - ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులు, పొడవు చేతుల కుర్తాలు ధరించాలి.
 - దోమలను పారదోలే ‘మస్కిటో రెపెల్లెంట్స్’ ఉపయోగించాలి.
 - ఈ దోమలు పగలూ కుడతాయి... కాబట్టి పగటి వేళ కూడా జాగ్రత్తగా ఉండాలి.
 ఇక వ్యాధి గర్భవతులకు ఈ వ్యాధి సోకితే మిగతా వారిలాగే వ్యక్తిగతంగా వారికీ,  ప్రసవం తర్వాత తమ బిడ్డలకు మెదడు కుంచించుకుపోయే మెక్రోసెఫాలీతో వారి బిడ్డలకూ ముప్పు కలిగే అవకాశం ఉంది కాబట్టి  గర్భవతులు దోమలు కుట్టకుండా మరింత జాగ్రత్తగా ఉండాలి.

 చికిత్స...
 - వ్యాధి సోకిన తర్వాత నిర్దిష్ట చికిత్స ప్రక్రియ లేదు.
 - ఇతర వైరల్ జబ్బుల విషయంలో ఇచ్చే మందులే దీనికీ ఇస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా