జొమాటో బాయ్స్‌ దేశ భక్తికి సెల్యూట్‌!

28 Jun, 2020 08:24 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కోల్‌కతా : కొంతమంది జొమాటో ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ వినూత్నంగా తమ దేశ భక్తికి చాటుకున్నారు. పస్తులు ఉండి చస్తాం కానీ, చైనా పెట్టుబడులు ఉన్న కంపెనీలో పనిచేయమంటూ ఉద్యోగాలు వదులుకున్నారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లద్దాఖ్‌ గల్వాన్‌ లోయలో జరిగిన చైనా దాడిలో 20 మంది భారత సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా చైనా వ్యతిరేక ఉద్యమాలు మొదలయ్యాయి. చైనా వస్తువులను బ్యాన్‌ చేయాలని, ఎవరూ వాడకూడదని ప్రముఖులు సైతం పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోల్‌కతాకు చెందిన కొందరు జొమాటో బాయ్స్‌ అక్కడి బెహాలా వద్ద వినూత్నంగా నిరసనలు తెలియజేసి తమ దేశ భక్తిని చాటుకున్నారు. ( అమెరికన్‌ సంస్థతో జొమాటో ఒప్పందం..)

నిరసన తెలుపుతున్న జొమాటో బాయ్స్‌

జొమాటో అధికారిక టీషర్టులను ఓ చోట కుప్పగా పోసి తగలబెట్టారు. అనంతరం జొమాటోలో చైనా పెట్టుబడులు ఉన్నాయని, దీని ద్వారా ఆహార పదార్థాలు ఆర్డర్‌ చేయవద్దని పిలుపునిచ్చారు. తమ ఉద్యోగాలను వదిలేస్తున్నట్లు తెలిపారు. చైనా.. భారత దేశం నుంచి ఆదాయం పొందుతూ దేశ సైనికులపై దాడి చేస్తోందని, భారత భూభాగాన్ని సొంతం చేసుకోవటానికి ప్రయత్నిస్తోందని.. అలా జరగకుండా చేయాలని అన్నారు. పస్తులు ఉండి చస్తాం కానీ, చైనా పెట్టుబడులు ఉన్న వాటిలో పనిచేయమని తేల్చిచెప్పారు.  

మరిన్ని వార్తలు