లాక్‌డౌన్‌ వేళ ఉద్యోగులకు జొమాటో షాక్‌

15 May, 2020 17:16 IST|Sakshi

13శాతం ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధం

రాబోయే ఆరు నెలలపాటు జీతాల్లోనూ కోత

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ జొమాటో యాజమాన్యం ఉద్యోగులకు ఊహించని షాక్‌ ఇచ్చింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆన్‌లైన్‌ పుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో 13శాతం ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధం చేసింది. ఎంతమందిని తొలగిస్తారనే దానిపై స్పష్టత లేనప్పటికీ దాదాపు 500 మంది ఉద్యోగులను తప్పిస్తారని అంచనా.

దీనిపై జొమాటో వ్యవస్థాపకుడు, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ దీపిందర్‌ గోయల్‌ మాట్లాడుతూ.. 'ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సంస్థపై తీవ్ర ప్రభావం ఏర్పడింది. వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. దేశవ్యాప్తంగా అనేక రెస్టారెంట్లు శాశ్వతంగా మూతపడ్డాయి. రాబోయే 6 నుంచి 12 నెలల మధ్య కాలంలో మరో 25 నుంచి 40 శాతం రెస్టారెంట్లు మూత పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థకి ఉద్యోగులందరినీ భరించడం కష్టం కనుక 13శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. చదవండి: గూగుల్‌ పే.. కేంద్రానికి హైకోర్టు నోటీసులు

జూన్‌ నుంచి ఆరు నెలలపాటు ఉద్యోగులందరి వేతనాలలో కోతలు ఉంటాయని దీపిందర్‌ స్పష్టం చేశారు. కాగా తక్కువ వేతనాలు ఉన్నవారికి తక్కువ కోతలు, ఎక్కువ వేతనాలు ఉన్న వారికి 50శాతం కోతలు విధించనున్నట్లు తెలిపారు. సంస్థ ఉద్యోగులు ఇప్పటికే అనేక మంది రాబోయే ఆరు నెలల జీతాలు వదులుకోవడానికి స్వచ్చందంగా ముందుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

అయితే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిన వెంటనే వీరికి జీతాలు పూర్తి స్థాయిలో చెల్లిస్తామని అందుకు కనీసం 6 నెలల సమయం తీసుకునే అవకాశం ఉన్నట్లు' దీపిందర్‌ గోయల్‌ తెలిపారు. కాగా.. గతేడాది సెప్టెంబర్‌లో 540 మంది ఉద్యోగులను జొమాటో తొలగించిగా.. మరోసారి లేఆఫ్‌ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చదవండి: బుల్లోడా! నువ్వు సామాన్యుడివి కాదు..

మరిన్ని వార్తలు