ఆహారానికి మతం లేదు

1 Aug, 2019 03:34 IST|Sakshi

వైరల్‌గా మారిన జొమాటో ట్వీట్‌

న్యూఢిల్లీ: ‘ఆహారానికి మతం లేదు. ఆహారమే ఓ మతం’ అన్న జొమాటో ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారి నెటిజన్ల మన్ననలు అందుకుంటోంది. ఈ కామెంట్‌ వైరల్‌ కావడం వెనుక పెద్ద కథే ఉంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన పండిత్‌ అమిత్‌ శుక్లా జొమాటోలో మంగళవారం ఆహారం ఆర్డర్‌ చేశాడు. ఆహారాన్ని డెలివరీ చేసేందుకు వచ్చిన వ్యక్తి ముస్లిం కావడంతో డెలివరీ బాయ్‌ని మార్చాలని, లేదా ఆర్డర్‌ను క్యాన్సిల్‌ చేసి రిఫండ్‌ ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే మత ప్రాతిపదికన ఆహారాన్ని అందించే వ్యక్తులను మార్చబోమంటూ జొమాటో బదులిచ్చింది.

తనకు రిఫండ్‌ కూడా వద్దని కేవలం క్యాన్సిల్‌ చేయండి చాలు, మిగిలింది నేను లాయర్లతో చూసుకుంటానని అతడు బదులిచ్చాడు. దీంతో జొమాటో స్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ రంగంలోకి దిగారు. ‘భారతదేశం, దేశంలోని వైవిధ్యమైన మా వినియోగదారులు, భాగస్వాములు మాకు గర్వకారణం. మా విలువల పరిరక్షణలో వ్యాపారం నష్టపోయినా బాధలేదు’ అని ట్వీట్‌ చేశారు. ఈ వ్యవహారాన్నంతా అమిత్‌శుక్లానే స్క్రీన్‌షాట్లు తీసి మరీ ట్విట్ట ర్‌లో ఉంచాడు. దీంతో నెటిజన్లు శుక్లాను ఓ ఆటాడుకుంటున్నారు.

తమరు ఆర్డర్‌ చేసిన ఫుడ్‌ను ముస్లిం తయారుచేయలేదని మీరు గ్యారంటీ ఇవ్వగలరా అంటూ ఓ వ్యక్తి వ్యంగ్యంగా శుక్లాని విమర్శించారు. తమరు నడిపే వాహన ఇంధనం కూడా అక్కడి ముస్లిం ఇంధనమే (ఆ దేశాల నుంచే దిగుమతి అవుతోంది) అంటూ మరోవ్యక్తి ట్వీట్‌ చేశారు. ఈ తతంగమంతా చూసిన కొందరు అధి కారులు కూడా దీనిపై స్పందించారు. ‘కంపెనీని అభినందించేందుకు నాకో కారణం దొరికింది. యాప్‌ను ప్రేమిస్తున్నాను’ అంటూ జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌ చేశారు. ‘సెల్యూట్‌ దీపిందర్‌ గోయల్‌ ! అసలైన భారతీయుడివి నువ్వే.. నిన్ను చూసి గర్విస్తున్నాం’ అని మాజీ ఎలక్షన్‌ కమిషనర్‌ ఖురేషీ అన్నారు.

నేను పేదవాన్ని... ఏం చేయగలను !
‘జరిగిన ఘటనతో నేనెంతో బాధపడ్డాను. కానీ ఏం చేయగలను, మేమంతా పేదవాళ్లం. బాధలు తప్పవు’ అంటూ అమిత్‌ శుక్లాకు ఆహారం డెలివరీ చేసేందుకు వెళ్లిన ఫయాజ్‌ అన్నారు. ‘ఆర్డర్‌ అందుకున్న తర్వాత లొకేషన్‌ కోసం ఆయనకు ఫోన్‌చేశాను. ఆర్డర్‌ కాన్సిల్‌ చేశాను అన్నాడు’ అని వివరించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు