‘పద్మినీ రెడ్డి బీజేపీ సానుభూతిపరురాలు’

12 Oct, 2018 14:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డి వ్యవహారంలో అభాసుపాలైన బీజేపీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ ఉదంతం తమ పార్టీపై ఎటువంటి ప్రభావం చూపబోదని చెప్పుకొచ్చింది. పద్మినీ రెడ్డి తమ పార్టీ సానుభూతిపరురాలని బీజేపీ శాసనసభ పక్ష మాజీ నేత జి. కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘మా పార్టీలో చేరాలనుకుని వచ్చిన ఆమెను స్వాగతించాం. ఏమి ఇబ్బంది అయిందో తెలియదు. తర్వాత ఆమె మనసు మార్చుకున్నార’ని పేర్కొన్నారు. (చదవండి: మధ్యాహ్నం బీజేపీకి జై.. రాత్రి సొంతగూటికి..)

ప్రత్యేక తెలంగాణ వద్దన్న మజ్లిస్‌ పార్టీని భుజాన వేసుకున్న టీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ద్రోహులకు పెద్ద పీఠ వేసి పాలన చేస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కారుకు కచ్చితంగా తెలంగాణ ప్రజలు తమ చైతన్యాన్ని రుచి చూపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ కుటుంబ పాలనకు తగిన శాస్తి చేయాలని పిలుపునిచ్చారు. సచివాలయానికి రాని ముఖ్యమంత్రి, మహిళా మంత్రిలేని కేబినెట్ చూసి ప్రజలు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తారన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేయనందుకు, గిరిజన రిజర్వేషన్ల వ్యవహారంలో కేసీఆర్‌ పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు