రెవెన్యూశాఖలో ప్రక్షాళన షురూ..!

27 Jun, 2019 03:44 IST|Sakshi

రెవెన్యూలో బదిలీలకు రంగం సిద్ధం 

ఒకట్రెండు రోజుల్లో ఆదేశాలొచ్చే అవకాశం 

కంప్యూటర్‌ ఆపరేటర్‌ నుంచి ఆర్డీఓ వరకు.. 

మూకుమ్మడి స్థానచలనాలకు సర్కారు మౌఖిక ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: రెవెన్యూశాఖను సంస్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా.. దీర్ఘకాలికంగా ఒకే చోట తిష్టవేసిన ఉద్యోగులను ఆయా స్థానాలనుంచి బదిలీ చేయాలని నిర్ణయించింది. రెవెన్యూశాఖను అవినీతిరహితంగా మార్చేందుకు సంకల్పించిన నేపథ్యంలో మూకుమ్మడి బదిలీలతో కొంతమేర మార్పు తీసుకురావొచ్చని సర్కారు భావిస్తోంది. ఈ క్రమంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ నుంచి మొదలుపెట్టి.. రెవెన్యూ డివిజనల్‌ అధికారి (ఆర్డీఓ) స్థాయి వరకు అందరికీ స్థానచలనం చేయాల్సిందేనని యోచిస్తోంది. రెవెన్యూ శాఖలో పైసలివ్వందే ఫైలు ముందుకు కదలడంలేదని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఈ శాఖను ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. 

ఒకవైపు కొత్త రెవెన్యూ చట్టానికి పదును పెడుతూనే.. మరోవైపు ఉద్యోగులను సమూల మార్పులు చేసేలా విధానాన్ని రూపొందించాలని మాజీ సీఎస్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ నేతృత్వంలోని నిపుణుల కమిటీ సూచించారు. ఈ మేరకు నిపుణుల కమిటీ నూతన రెవెన్యూ చట్టం, ఉద్యోగుల విలీనం తదితర అంశాలను లోతుగా అధ్యయనం చేస్తోంది. అయితే, చట్టం మనుగడలోకి రావడం ఆలస్యమవుతున్నందున.. ఆ లోపు ఉద్యోగుల బదిలీల ద్వారా కాస్తయినా మార్పు తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. 
 
దిగువ నుంచి ఎగువ వరకు 
ఈ విషయంలో ఎలాంటి తారతమ్యాల్లేకుండా.. దిగువస్థాయి నుంచి ఎగువస్థాయి వరకు తేడాల్లేకుండా బదిలీలు వర్తింపజేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే తహసీల్దార్‌ కార్యాలయాల్లోని కంప్యూటర్‌ ఆపరేటర్లు, వీఆర్‌ఓ, ఆర్‌ఐ, జూనియర్‌ అసిస్టెంట్, సీనియర్‌ అసిస్టెంట్, నయాబ్‌ (ఉప) తహసీల్దార్లను ఆ జిల్లా యంత్రాంగం బదిలీ చేసింది. ఇదే విధానాన్ని ఇతర జిల్లాల్లో కూడా అమలు చేయడం ద్వారా కుర్చీలకు అతుక్కుపోయిన సిబ్బందిని తప్పించవచ్చని, తద్వారా అవినీతిని కొంతమేరనైనా తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లను బదిలీచేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నందున.. స్థానచలనం చేయాల్సిన అధికారుల జాబితాను రెవెన్యూశాఖ తయారు చేస్తోంది. కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడంలో జాప్యం జరుగుతుండడంతో ఆలోపే ఉద్యోగుల బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని యోచిస్తోంది. 
 
సమాచార సేకరణ! 
దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగుల డేటాబేస్‌ను ఇటీవల సీసీఎల్‌ఏ కార్యాలయం సేకరించింది. ఈ మేరకు నిర్దేశిత ఫార్మాట్‌లో వివరాలను రాబట్టింది. సర్వీసులో చేరిన తర్వాత ఏయే చోట్ల, ఏయే పోస్టుల్లో ఎన్నాళ్లు పనిచేశారు? సొంత జిల్లా ఏదీ? తదితర సమాచారాన్ని సేకరించింది. దిగువస్థాయి సిబ్బంది మొదలు.. తహసీల్దార్‌ వరకు ఈ వివరాలను పంపాలని కోరింది. జూనియర్‌ అసిస్టెంట్‌/టైపిస్ట్, సీనియర్‌ అసిస్టెంట్, డీటీ/పీడీటీ, తహసీల్దార్ల సమాచారాన్ని సేకరించింది. ఈ వివరాలకు అనుగుణంగా బదిలీల క్రతువును పూర్తి చేయాలనే యోచనలో ఉంది. ఒకే జిల్లాల్లో ఎన్నాళ్ల నుంచి పనిచేస్తున్నారనే లెక్క ఆధారంగా బదిలీలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ డేటాను ముఖ్యమంత్రి కార్యాలయానికి రెవెన్యూ శాఖ నివేదించినట్లు తెలిసింది. అయితే, ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్లు మినహా మిగతా స్టాఫ్‌ను జిల్లా యంత్రాంగం బదిలీ చేసింది. దీంతో ఇదే విధానాన్ని ఇతర జిల్లాల్లో అమలు చేయాలని రెవెన్యూశాఖకు సీఎంవో మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు ఉన్నతస్థాయి అధకారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. 
 
తహసీల్దార్లను కూడా.. 
తహసీల్దార్ల బదిలీకి కూడా రంగం సిద్ధమైంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో సొంత జిల్లాలో పనిచేస్తున్న, మూడేళ్లుగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్న వారిని ఈసీ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం స్థానచలనం కలిగించింది. తాజాగా ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పాత జిల్లాలకు పంపాలని తహసీల్దార్లు సచివాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. 466 మంది తహసీల్దార్ల బదిలీలకు ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. అదే క్రమంలో పూర్వపు జిల్లాలకు కేటాయించిన అనంతరం.. పాత పోస్టింగ్‌లు ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్లకుప్రభుత్వం సూచనలు జారీ చేయనుందని సమాచారం. అలాగే ఇతర తహసీల్దార్లను జోనల్‌ పరిధిలో ఏ జిల్లాకైనా పంపడంలో ఉద్యోగ సంఘాల ఒత్తిడికి తలొగ్గవద్దని సీఎం పేషీ సంకేతాలిచ్చినట్లు సమాచారం. కాగా, వచ్చే నెలలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో సత్వరమే బదిలీలు జరగాల్సివుంది. ఎన్నికల ప్రక్రియను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం రెవెన్యూ అధికారుల బదిలీల్లో మరికొంత ఆలస్యం జరిగే అవకాశముంది.  

మరిన్ని వార్తలు