టీడీపీకి భారీ షాక్‌; యువనేత గుడ్‌బై

30 Sep, 2019 16:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు దేశం పార్టీకి తెలంగాణ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యువ నాయకుడు తూళ్ల వీరేందర్ గౌడ్ సోమవారం టీడీపీకి గుడ్‌బై చెప్పారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి పంపించారు. రాజకీయ అవసరాల కోసం సిద్ధాంతాలకు భిన్నంగా టీడీపీ వ్యవహరిస్తోందని లేఖలో విమర్శించారు. ఉన్నత ఆదర్శాలు, సిద్ధాంతాలతో ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం ఎంతోగానో​ తనను బాధించిందని పేర్కొన్నారు. పార్టీకి సిద్ధాంతాలు లేకపోడమన్నది ఆత్మ లోపించడమేనని వ్యాఖ్యానించారు. కాగా, వీరేందర్‌ గౌడ్‌ అక్టోబర్ 3న జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం.

సీనియర్‌ నాయకుడు దేవేందర్‌ గౌడ్‌ కుమారుడైన వీరేందర్‌ టీడీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. అయితే ఎమ్మెల్యే కావాలన్న ఆయన కల ఇప్పటివరకు నెరవేరలేదు. తన వారసుడిని ఎమ్మెల్యే చేసేందుకు దేవేందర్‌ గౌడ్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 2014లో ఉప్పల్‌ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశించి వీరేందర్‌ భంగపడ్డారు. చంద్రబాబు ఆదేశాల మేరకు చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి అయిష్టంగానే పోటీ చేసి ఓటమి చవిచూశారు. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్‌ టిక్కెట్‌ కోసం ఆయన ఎంతో కష్టపడాల్సి వచ్చింది. చివరకు మహాకూటమి తరఫున పోటీ చేసినా గెలుపు దక్కలేదు. చాలా మంది సీనియర్‌ నాయకులు టీడీపీ వదిలివెళ్లిపోవడంతో తెలంగాణలో ఆ పార్టీ నిస్తేజంగా మారింది. ఈ నేపథ్యంలో వీరేందర్‌ గౌడ్‌ కూడా తన దారి తాను చూసుకున్నారు.

Read latest News News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు