1 నుంచి ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లు 

27 Jun, 2019 04:32 IST|Sakshi

నేటి నుంచి నిర్వహించాల్సిన ప్రక్రియ వాయిదా 

రివైజ్డ్‌ షెడ్యూల్‌ జారీ చేసిన ప్రవేశాల కమిటీ 

యాజమాన్య ప్రతిపాదిత ఫీజుపై నేడు అప్పీల్‌కు విద్యాశాఖ  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం గురువారం నుంచి చేపట్టాల్సిన వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడింది. ఫీజుల వ్యవహారంలో తలెత్తిన గందరగోళం కారణంగా ప్రవేశాల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను మాత్రం గురువారం నుంచి వచ్చే నెల 3 వరకు యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించింది. జూలై 1వ తేదీ నుంచి 4 వరకు వెబ్‌ ఆప్షన్లు నిర్వహించేలా రివైజ్డ్‌ షెడ్యూల్‌ జారీ చేసింది. 

ఫీజుల ఖరారులో గందరగోళంతో... 
రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ తదితర వృత్తి విద్యా కాలేజీల్లో వచ్చే మూడేళ్లకు వార్షిక ఫీజు ఖరారు చేయాల్సిన టీఏఎఫ్‌ఆర్‌సీకి చైర్మన్‌ను నియమించడంలో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో టీఏఎఫ్‌ఆర్‌సీ సభ్య కార్యదర్శి ఫీజుల ఖరారు కోసం నోటిఫికేషన్‌ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించారు.   కొన్ని కాలేజీలు ఫీజులు ఖరారు చేయాలని కోర్టును ఆశ్రయించడంతో టీఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌ను నియమించి ఫీజులు ఖరారు చేసే వరకు యాజమాన్యాలు ప్రతిపాదించిన ఫీజును అమలు చేయాలని కోర్టు తీర్పు వెలువరిం చింది. అనంతరం ఆయా ఫీజుల్లో ఏమైనా హెచ్చుతగ్గులు ఉంటే తర్వాత సర్దుబాటు చేసుకోవాలని సూచించింది.  కోర్టును ఆశ్రయించిన 81 కాలేజీలు ప్రతిపాదించిన ఫీజును అమలు చేస్తే తల్లిదండ్రులపై భారం పడుతుందని, తర్వాత సర్దుబాటు చేసే అవకాశం ఉన్నా ముం దుగా ఆ భారం భరించాల్సిన పరిస్థితి వస్తుం దని భావించిన విద్యాశాఖ ఆ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించింది. 

టీఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌ నియామకం జరిగి ఫీజులు ఖరారు చేసేవరకు పాత ఫీజులను అమలు చేయాలని కోరుతూ అప్పీలుకు వెళ్లనుంది. కాగా, తీర్పు కాపీ బుధవారం రాత్రి అందిందని, దీనిపై గురువారం అప్పీల్‌కు వెళ్తున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి ప్రారంభం కావాల్సిన వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా వేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.  టీఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌ నియామకానికి ముగ్గురు హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేయాలంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి గురువారం ప్రతిపాదన పంపించనున్నట్టు తెలిపారు. ముగ్గురిలో ఒకరిని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది.  

యథావిధిగా సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ 
ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం బుధవారం వరకు 45,156 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకొని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ కోసం స్లాట్లుæ బుక్‌ చేసుకున్నారు. గురువారం నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను  నిర్వహించనున్నారు. విద్యార్థులు జూలై ఒకటో తేదీ వరకు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి వెరిఫికేషన్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చని ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ నవీన్‌మిట్టల్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు