గ్రేడ్‌–3 మున్సిపాలిటీగా బాన్సువాడ

13 Jan, 2018 10:39 IST|Sakshi

ఉత్తర్వులు జారీ

బాన్సువాడలో సంబరాలు  

బాన్సువాడ టౌన్‌(బాన్సువాడ): బాన్సువాడ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. పట్టణాన్ని గ్రేడ్‌–3 మున్సిపాలిటీగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 15 వేలకు జనాభా ఉన్న పట్టణాలను మున్సిపాలిటీలుగా మార్చాలని సర్కారు నిర్ణయించిన సంగ తి తెలిసిందే. బాన్సువాడ గ్రేడ్‌–3 మున్సిపాలిటీగా మారనున్న నేపథ్యం లో పట్టణ రూపురేఖలు మారనున్నాయి. మౌలిక వసతులు మెరుగుపడడంతో ప్రణాళిక బద్దమైన అభివృద్ధి జరగనుంది. పట్టణ ప్రణాళిక ప్రకా రం రోడ్లు, భవనాలు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. అలాగే, ఆదాయం పెరగడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు రానున్నాయి.బాన్సువాడలో 20 వార్డులు, 31వేల జనాభా ఉంది.

తొలుత నగర పంచాయతీగా..
వాస్తవానికి బాన్సువాడను తొలుత నగర పంచాయతీగా మార్చాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు జీవో కూడా సిద్ధమైంది. అయితే, మంత్రి పోచారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడారు. దీంతో ఆయన మున్సిపల్‌ అధికారులతో మాట్లాడి గ్రేడ్‌–3 మున్సిపాలిటీగా ప్రకటించాలని ఆదేశించారు.

మంత్రికి ఘన స్వాగతం..
బాన్సువాడను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి శుక్రవారం బాన్సువాడలో ఘన స్వాగతం లభించింది. బాన్సువాడను మున్సిపాలిటీగా మార్చేందుకు ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి బాన్సువాడకు వచ్చిన మంత్రికి కొయ్యగుట్ట వద్ద టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

చిరకాల స్వప్నం ఫలించింది: మంత్రి పోచారం
బాన్సువాడ పట్టణాన్ని గ్రేడ్‌–3 మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ కృషితో బాన్సువాడ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. బాన్సువాడలో రూ.17కోట్లతో వంద పడకల మెటర్నిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పట్టణంలో కల్కి చెరువును మినీ ట్యాంకుబండ్‌గా, ఎల్లయ్య చెరువును వారంతపు సంతగా మారుస్తున్నట్లు పేర్కొన్నారు. మినీస్టేడియం, పట్టణంలో సీసీ రోడ్డు నిర్మాణం కొనసాగుతుందన్నారు. మత్య్సకారులు చేపలు విక్రయించేందుకు భవనంను నిర్మిస్తున్నట్లు ఆయన వివరించారు. సహకార సంఘాల ఎన్నికలపై సీఎంతో చర్చించామని, త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. రైతు సమన్వయ కమిటీలపై నివేదికలు అందించామన్నారు. ఆర్డీవో రాజేశ్వర్, టీఆర్‌ఎస్‌ నాయకులు, వ్యాపారులు మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు