రాష్ట్రంలో దుర్మార్గ పాలన

18 Jan, 2018 10:36 IST|Sakshi

వీఆర్‌ఏ సాయిలును చంపింది ఇసుక మాఫియానే

ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో కేసును తారుమారు చేశారు

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి డిమాండ్‌

ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా కామారెడ్డిలో మహాధర్నా

సాక్షి, కామారెడ్డి:  తెలంగాణ రాష్ట్రంలో మాఫియా పెత్తనం నడుస్తోందని, ఇంతటి దుర్మార్గపు పాలన మరెక్కడా లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట ఉన్న ధర్నా చౌక్‌లో బుధవారం మహాధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్‌ఏ సాయిలు ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న పాపానికి ట్రాక్టర్‌తో గుద్దించి చంపారని, కానీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఇసుక ట్రాక్టర్‌ను ఇటుక ట్రాక్టర్‌గా వక్రీకరించారని ఆరోపించారు.

వంశపారంపర్యం గా వీఆర్‌ఏగా పనిచేస్తున్న సాయిలు అస లు వీఆర్‌ఏనే కాదని కలెక్టర్, ఎస్పీలు పేర్కొనడం సరికాదన్నారు. ఇసుక ట్రాక్ట ర్‌ కాదని, సాయిలు వీఆర్‌ఏ కాదని, మద్యం తాగి ఉన్నాడని కలెక్టర్, ఎస్పీలు పేర్కొనడం దారుణమన్నారు. ప్రభుత్వ కుట్రలో కలెక్టర్, ఎస్పీలు భాగమయ్యా రని ఆరోపించారు. రైతాంగానికి దన్ను గా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం ట్రాక్టర్ల ను అందిస్తుంటే.. రాష్ట్రప్రభుత్వం వాటి ని తన కార్యకర్తలకు ఇచ్చి ఇసుక అక్రమ రవాణాకు ప్రోత్సహిస్తోందన్నారు.

ప్రగతిభవన్‌లో తెలంగాణ ద్రోహులు..
ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులే మాఫియాగా ఏర్పడి ఇసుక, డ్రగ్, కలప, లిక్కర్, దందాలు చేస్తున్నారన్నారు. ఉద్యమాన్ని అడ్డుకుని, దాడులు చేసిన వాళ్లు ఇప్పుడు ప్రగతిభవనలో పెత్తనం చెలాయిస్తున్నారన్నారు. ఉద్యమకారులను తరిమితరిమి కొట్టిన వాళ్లే ఇప్పుడు ముఖ్యమంత్రి పక్కన ఉన్నారని స్వయంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో పాటు కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే మాట్లాడుతున్నారని గుర్తు చేశారు.  

రాష్ట్ర సాధనోద్యమంలోకన్నా..
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థు లను అరెస్టులు చేసి కేసులు పెట్టారని, తెలంగాణ కోసం పోరాడిన కోదండరాం ను ఉద్యమ సమయంలోకన్నా ఇప్పుడే ఎక్కువసార్లు అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యమ వుతోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పు డు కేసులతో జైళ్లకు పంపుతున్నారని, మందకృష్ణ మాదిగను చంచల్‌గూడ జైలులో నిర్బంధించారని పేర్కొన్నారు.

‘పంచాయతీ’కి ఏం చేశారు?
నాలుగేళ్ల పాలనలో పంచాయతీలను నిర్వీర్యం చేసిన టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు పంచాయతీలకు జవసత్వాలు కల్పిస్తామంటూ ప్రజల దృష్టిని మళ్లిస్తోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. కేంద్రం అందించిన 14 వ ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ నిధులే తప్ప గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. కామారెడ్డిలో కాలేజీ భూమిని భూ మాఫియా ఆక్రమిస్తుంటే ప్రభుత్వం చూస్తూ కూర్చోవడం దారుణమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. లిక్కర్‌ను ఏరులై పారిస్తున్నారని, సంక్రాంతికి రూ. 2 వందల కోట్ల మద్యం అమ్ముడైందని సర్కారు చంకలు కొట్టుకుంటోందని విమర్శించారు.  

అప్పుల కుప్పగా మార్చారు..
ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ పేరుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాకముందు రాష్ట్ర అప్పులు రూ. 63 వేల కోట్లు ఉంటే ఇప్పుడు రూ. లక్షా 40 వేల కోట్లకు పెంచారని, అలాగే వివిధ పథకాల పేరుతో మరో లక్షన్నర కోట్ల అప్పులు చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ అవినీతి, అక్రమ కార్యక్రమాలు, మాఫియా పాలనను ప్రజలు అర్థం చేసుకోవాలని, దానికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.  

టీఆర్‌ఎస్‌ నాయకులకే ‘యంత్రలక్ష్మి’..
వేల్పూర్‌లో రైతులకు ఇవ్వాల్సిన యంత్రలక్ష్మి ట్రాక్టర్లను టీఆర్‌ఎస్‌ నాయకులకు ఇచ్చారని, వాటితో ఇసుక దందా సాగిస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మీనారాయణ ఆరోపించారు. జిల్లాలో మంత్రి అండతో బాన్సువాడ ప్రాంతంలో ఇసుక మాఫియా చెలరేగుతోందన్నారు. అడ్డుకోబోయిన వీఆర్‌ఏ సాయిలును హతమార్చారని ఆరోపించారు. సాయిలు హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. వీఆర్‌ఏ సాయిలు హత్యపై ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్, ఎస్పీలు తప్పుడు నివేదికలు ఇచ్చారని బీజేపీ తెలంగాణ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ మురళీధర్‌గౌడ్‌ ఆరోపించారు. ప్రభుత్వం ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి ఆరోపించారు.  

అడ్డుకున్న పోలీసులు....
సాయిలు హత్యపై విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ సాయిలు కుటుంబ సభ్యులను వెంట పెట్టుకుని బీజేపీ నేత కిషన్‌రెడ్డి ర్యాలీగా బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలు, నాయకులు రోడ్డుపైనే బైఠాయించారు. పోలీసులు వారందరినీ అరెస్టు చేసి పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆందోళనలో మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, పార్టీ నాయకులు మోతె కృష్ణాగౌడ్, జూలూరి సుధాకర్, డాక్టర్‌ సిద్దిరాములు, డాక్టర్‌ మర్రి రాంరెడ్డి, మోహన్‌రెడ్డి, నాయుడు ప్రకాశ్, బంగారు సాయిలు, నీలం రాజులు, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు