గొర్రెల పంపిణీలో భేష్‌

17 Jan, 2018 11:31 IST|Sakshi

భూ ప్రక్షాళనలోనూ కామారెడ్డి ఆదర్శం

అభినందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

కొత్త పంచాయతీల ఏర్పాటు వేగం పెంచాలి

మార్చి 11న అన్ని గ్రామాల్లో పాస్‌బుక్కులు అందించాలి

ప్రగతిభవన్‌ వేదికగా కలెక్టర్లు, జేసీలకు సీఎం దిశానిర్దేశం

సాక్షి, కామారెడ్డి : యాదవులకు గొర్రెల పంపిణీ లో కామారెడ్డి జిల్లా ద్వితీయ స్థానంలో ఉండడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలెక్ట ర్‌ సత్యనారాయణను అభినందించారు. భూరికార్డుల ప్రక్షాళనపైనా ప్రశంసలు అందించారు. 88 శాతం గొర్రెల పంపిణీతో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో ఉంది. రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన సరాసరి 93 శాతం కాగా.. కామారెడ్డిలో మాత్రం 96 శాతం పూర్తయ్యింది. దీంతో సీఎం జిల్లా అధికారులను అభినందించారు.  

మంగళవారం ప్రగతిభవన్‌ వేదికగా కలెక్టర్లు, జేసీలు, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. భూ రికార్డుల ప్రక్షాళన, కొత్త పాసుబుక్కుల పంపిణీ, కొత్తపంచాయతీల ఏర్పాటు, గొర్రెల పంపిణీ తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. జిల్లాల్లో చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన 93 శాతం పూర్తయ్యిందని, 92 శాతం ఖాతాలు వివాద రహితమైనవని తేలాయని పేర్కొన్నారు. ఫిబ్రవరి నెలాఖరుకల్లా ఆర్డీవోలు, జాయింట్‌ కలెక్టర్లు, కలెక్టర్లు రెÐవెన్యూ కోర్టులు నిర్వహించి వివాదాలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. మార్చి 11న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఏకకాలంలో పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయాలని, ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం కోసం నోడల్‌ ఆఫీసర్లను నియమించి, వారికి వాహనాన్ని సమకూర్చాలని కలెక్టర్లను ఆదేశించారు.

కొత్త పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి వారంలో ప్రతిపాదనలు పంపించాలని సీఎం కేసీఆర్‌ కలెక్టర్లను ఆదేశించారు. పంచాయతీల ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీలను బలోపేతం చేయాలని సూచించారు. 500 జనాభా ఉన్న పంచాయతీకి రూ. 5 లక్షలు, జనాభాను బట్టి నిధులు సమకూర్చనున్నట్లు సీఎం తెలిపారు. పంచాయతీ పన్నులు, జాతీయ స్థాయిలో అందే నిధులు, ఉపాధి హామీ నిధులను ఉపయోగించుకుని గ్రామాల్లో ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. తహసీల్‌ కార్యాలయాల్లో వసతుల కల్పనకు జిల్లాకు కోటి రూపాయ లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రైతు సమన్వయ సమితుల స భ్యులకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మినవారిపై పీడీ కేసులు పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్‌ సత్యనారాయణ, జేసీ సత్తయ్య, డీపీవో రాములు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు