అధికారుల షి‘కారు’!

22 Jan, 2018 09:33 IST|Sakshi

వాహనాల ‘అద్దె’నూ వదలని వైనం

యథేచ్ఛగా సొంత వాహనాల వినియోగం

నీరుగారుతున్న ఓనర్‌ కం డ్రైవర్‌ పథకం

కలెక్టరేట్‌లోని అక్షర ప్రణాళిక భవన్‌లో గల ఓ శాఖకు చెందిన ద్వితీయ శ్రేణి అధికారి ఒకరు.. తన రెండు కార్లను తాను పని చేస్తున్న శాఖలోనే అద్దెకు పెట్టాడు. ఆ శాఖలో కొన్నేళ్లుగా అవే వాహనాలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను అద్దెకు పెట్టినట్లు సదరు శాఖ జిల్లా అధికారికి తెలిసినా పట్టించుకోవడం లేదు. ఒక్క సదరు శాఖలోనే కాకుండా మరికొన్ని శాఖల్లో అధికారులు, ఉద్యోగులకు చెందిన వాహనాలనే ‘అద్దె’ ప్రాతిపదికన వినియోగిస్తున్నారు. కొంత మంది మండల స్థాయి అధికారులైతే నిబంధనలకు విరుద్ధంగా తెల్లరంగు నెంబర్‌ ప్లేట్‌ కలిగిన సొంత, బంధువుల కార్లను వాడుతున్నారు.

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): అక్రమార్జన కోసం కొందరు అధికారులు అడ్డదారి తొక్కుతున్నారు. వాహనాల అద్దెను కూడా అక్రమంగా వెనుకేసుకుంటున్నారు. తాము పని చేస్తున్న సొంత శాఖల్లో కొందరు జిల్లా అధికారులు తమ సొంత వాహనాలను లేదా బంధువులవి పెట్టుకుని ‘అద్దె’ డబ్బులను నెక్కొస్తున్నారు. ఇటు మండల స్థాయిలోనూ తహసీల్దార్లు, ఎంపీడీవోలు కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, దండిగా వేతనాలు పొందుతున్న అధికారులే.. ఇలా అద్దె డబ్బులపై కన్నేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా జిల్లాలో సుమారు 60 శాతం వరకు సొంత కార్లు, బంధువులవి అద్దె ప్రాతిపదికన కొనసాగుతున్నాయని సమాచారం.

నిబంధనల ప్రకారం ప్రభుత్వ శాఖల్లో జిల్లా అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించడం కోసం అద్దె వాహనాలను పెట్టుకోవచ్చు. అయితే, సదరు వాహనాలకు పసుపు రంగు నెంబర్‌ (టాక్సీ) ప్లేట్‌ తప్పనిసరిగా ఉండాలి. తెల్ల రంగు నెంబర్‌ (ప్రైవేట్‌) ప్లేట్‌ కలిగిన వాహనాలను వినియోగించకూడదని కచ్చితమైన నిబంధనలున్నాయి. కానీ చాలా మంది అధికారులు తెల్ల రంగు నెంబర్‌ ప్లేట్‌ కలిగిన వాహనాలనే ఉపయోగిస్తూ ఆర్‌టీఏ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. అలాగే, అద్దె వాహనాలకు గతంలో 2500 కిలోమీటర్లు తిరిగినందుకు నెలకు రూ.25వేలు చెల్లించిన ప్రభుత్వం.. ప్రస్తుతం దీనిని రూ.35 వేలకు పెంచింది. అయితే కొన్ని సంవత్సరాల నుంచే ఆయా శాఖల్లో కొంత మంది జిల్లా అధికారులు అద్దె వాహనాలను వినియోగించకుండా సొంతవి లేదా బంధువులవి వినియోగిస్తున్నారు. డ్రైవర్‌ని పెట్టుకుని నెల నెల వేతనాలు చెల్లించగా, మిగతా డబ్బులు అధికారుల జేబుల్లోకి వెతున్నాయి.

అదే విధంగా మండల స్థాయి అధికారులైన చాలా మంది తహసీల్దార్లు, ఎంపీడీవోలు కూడా సొంత వాహనాలను బహిరంగంగానే వినియోగిస్తున్నారు. వీటికి కూడా తెల్లరంగు కలిగిన నెంబర్‌ ప్లేట్‌లే ఉన్నాయి. తహసీల్దార్లు, ఎంపీడీవోలు తమ కార్యాలయాల్లో పని చేసే వీఆర్‌ఏలను, సిబ్బందిని డ్రైవర్లుగా పెట్టుకుని వాహనాలను నడిపిస్తున్న వారు కూడా కొందరున్నారు. మరి కొందరైతే డ్రైవర్‌కి వేతనం ఇచ్చే బదులు, వారే స్వయంగా వాహనాలను నడుపుతున్నారు. మండల స్థాయి అధికారులకు కలిసి వచ్చిన విషయం ఏంటం టే తహసీల్దార్లకు, ఎంపీడీవోలకు ప్రభుత్వం నెల వారీగా అద్దె డబ్బులు విడుదల చేయదు. ఎనిమిది నెలలు, సంవత్సరానికి ఒకసారి నిధులను ఒకే సారి మంజూ రు చేస్తుంది. దీంతో ప్రైవేటు వ్యక్తులు అద్దెకు నడపడానికి ముందుకు రావడం లేదనే ఉద్దేశంతో వారి సొంత కార్లను వినియోగిస్తున్నారు.

మరిన్ని వార్తలు