పొంచి ఉన్న సాగునీటి కష్టాలు

26 Jan, 2018 16:52 IST|Sakshi
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు

ఐదు టీఎంసీలు కొరత ఏర్పడే అవకాశం.! 

చివరి తడులకు ఇబ్బందులు.. 

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటి కష్టాలు

నీటిని వృథా చేయొద్దు :  నీటి పారుదలశాఖ అధికారులు 

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటి కష్టాలు పొంచి ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యాసంగి పంటకు నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ జలాశయంలో నీటి లభ్యత పరిమితంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే నీటిని పొదుపుగా వాడుకోవాలని నీటి పారుదలశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. లేనిపక్షంలో చివరి తడులకు ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు.
సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: యాసంగికి నీటి విడుదల ప్రారంభమైన 2017 డిసెంబర్‌ 25 నాటికి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో 47 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఈ యాసంగి సీజను (2016 డిసెంబర్‌ 25) నాటికి ఎస్సారెస్పీలో 80 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. గత సీజనుతో పోల్చితే ఈ ఏడాది నీటి నిల్వ సగానికి తగ్గడంతో ఆయకట్టుకు సాగునీరం దడం ప్రశ్నార్థకమవుతోంది. 

చివరి తడులకు ఇబ్బందులు..? 
ఈ యాసంగి సీజనులో ప్రాజెక్టు కింద మొత్తం నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటిని విడుదల చేయాలని ప్రభుత్వం డిసెంబర్‌లో నిర్ణయించింది. లక్ష్మి కాలువ కింద నిజామాబాద్‌ జిల్లా పరిధిలో 16 వేల ఎకరాలు, నిర్మల్‌ జిల్లా పరిధిలోని సరస్వతి కాలువ కింద ఉన్న మరో 16,300 ఎకరాల ఆయకట్టు ఉంది. అలాగే జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో సుమారు 3.67 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలని భావిస్తున్నారు. కాకతీయ కాలువ పరిధిలోని ఎల్‌ఎండీ ఎగువ భాగం వరకు ఆయకట్టుకు సాగునీటిని అందించేలా నీటి పారుదలశాఖ ప్రణాళిక రూపొందించింది. మొత్తం ఎనిమిది తడులు నీటిని ఇవ్వాలని నిర్ణయించారు. కాకతీయ కాలువకు వారబందీ విధానంలో నీటిని విడుదల చేస్తున్నారు. మొదట్లో రోజుకు ఐదు వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు.అయితే చివరి ఆయకట్టుకు సాగునీరు చేరకపోవడంతో ఇప్పుడు రోజుకు ఆరు వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

ఇలా ఒక్కో తడికి 4.8 టీఎంసీల చొప్పున నీరు జలాశయం నుంచి విడుదలవుతోంది. ఈ లెక్కన ఎనిమిది తడులకు సుమారు 38.4 టీఎంసీల నీళ్లు అవసరం ఉంటుంది. కానీ నీటి విడుదల ప్రారంభించే నాటికి జలాశయంలో 47 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంది. డెడ్‌స్టోరేజీ, ఎవాబ్రేషన్‌ లాస్, తాగునీటి అవసరాలు పోగా కేవలం సుమారు 33 టీఎంసీలు మాత్రమే వాడుకునేందుకు వీలుంటుంది. కానీ ఎనిమిది తడులకు 38.4 టీఎంసీల నీటి అవసరం ఉన్న నేపథ్యంలో సుమారు ఐదు టీఎంసీల నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని ప్రాజెక్టు వర్గాలు భావిస్తున్నాయి. దీంతో పంట కీలక దశ చివరి తడికి ఇబ్బంది వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో రైతులు నీటిని వృథా చేయకుండా, పొదుపుగా వాడుకోవాలని నీటిపారుదల శాఖ «అధికారులు సూచిస్తున్నారు.  

గత యాసంగి సీజనులో 80 టీఎంసీలు.. 
గతేడాది ఈ యాసంగి సీజను ప్రారంభమయ్యే నాటికి ఎస్సారెస్పీలో 80 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దీంతో ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కానీ ఈసారి 47 టీఎంసీలే ఉండటంతో సాగునీటి ఇబ్బందులు పొంచి ఉన్నాయనే అభిప్రాయం  వ్యక్తమవుతోంది. కాగా గతేడాది యాసంగి సీజను మాదిరిగానే ఈసారి కూడా ఆయకట్టు రైతులు వరి వైపే మొగ్గుచూపడంతో నీటి అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని వృథా చేయకుండా వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాజెక్టులో నీటి లభ్యత దృష్ట్యా ఇందుకు రైతులు సహకరించాలి.’’ అని ఎస్సారెస్పీ ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీర్‌ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు