బంద్‌ సక్సెస్‌

21 Jan, 2018 11:09 IST|Sakshi

స్వచ్ఛందంగా బంద్‌లో విద్యా,వ్యాపార సంస్థలు

అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ 

కామారెడ్డి క్రైం: కామారెడ్డి పట్టణ బంద్‌ విజయవంతమైంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని కొందరు అక్రమంగా దున్నడాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ, అఖిలపక్ష, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డి బంద్‌ జరిగింది. వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి. అఖిలపక్షం ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ లు, విద్యార్థి సంఘాలు, వామపక్షాలు పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించాయి. తప్పుడు పత్రాలను సృష్టించి కళాశాల మైదానాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి తగిన గుణపాఠం చెబుతామని అఖిలపక్ష నేతలు పేర్కొన్నారు. కళాశాల ఆస్తులను కాపాడుకోవడం కోసం ఎంతటి ఉద్యమాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు.

ఆక్రమిస్తే సహించబోం: విప్‌ గోవర్ధన్‌
కళాశాల ఆస్తులను ఆక్రమిస్తే సహించబోమని ప్రభుత్వవిప్‌ గంప గోవర్ధన్‌ హెచ్చరించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన బైక్‌ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ప్రైవేట్‌ వ్యక్తులు దున్నిన కళాశాల మైదానాన్ని పరిశీలించారు. మైదానంలో వాలీబాల్‌ ఆడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి కళాశాల ఆస్తులు వెళ్లకుండా చూసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ప్రజా కోర్టు నుంచి మాత్రం తప్పించుకోలేరన్నారు. కళాశాల భూములను కాపాడుకునేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

 జేఏసీ చైర్మన్‌ జగన్నాథం, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిప్పిరిసుష్మ, ఎంపీపీ మంగమ్మ, బహుజన ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు క్యాతం సిద్దిరాములు, టీఆర్‌ఎస్‌ నేత నిట్టువేణుగోపాల్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు పిప్పిరి ఆంజనేయులు, కాంగ్రెస్‌ నేతలు నల్లవెల్లి అశోక్, నిమ్మ మోహన్‌రెడ్డి, మామిండ్ల అంజయ్య, బీజేపీ నాయకులు వి.మురళీధర్‌గౌడ్, చిన్నరాజులు, ప్రభాకర్‌యాదవ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి సిద్దిరాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కట్ల భూమన్న, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి రాజలింగం, విద్యార్థి సంఘాల నాయకులు ఆజాద్, అగ్గి రవీందర్, అరుణ్‌కుమార్, భానుప్రసాద్, సురేశ్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు