వసతి.. తరగతి ఒకే గది!

6 Jan, 2018 13:05 IST|Sakshi

బీసీ గురుకులాలకు సొంత భవనాలు కరువు

అద్దె గదుల్లో వసతుల లేమితో విద్యార్థులకు ఇక్కట్లు

జిల్లాలో మూడు బాలుర, రెండు బాలికల పాఠశాలలు

భవనాల నిర్మాణంలో సర్కారు జాప్యం

మైదానాలు లేక విద్యార్థులు క్రీడలకు దూరం

ఆరుగదుల్లో 240 మంది

బీసీ గురుకుల పాఠశాలలు ఇరుకు గదులు, అరకొర వసతుల మధ్య కొనసాగుతున్నాయి. సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా గదులు లేనందున ఒకే గదిలో వసతి, తరగతులు నడుస్తున్నాయి. ప్రభుత్వం సొంత భవనాలు నిర్మిస్తే ఇక్కట్లు తప్పుతాయని విద్యార్థులు అంటున్నారు.

మోర్తాడ్‌(బాల్కొండ): వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం 2017–18 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాలను ప్రారంభించింది. ఇందులో భాగం గా జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకుగాను మూడు బాలుర, రెండు బాలికల గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. బాలుర కో సం బాల్కొండ నియోజకవర్గానికి సంబంధిం చిన మోర్తాడ్‌లో, ఆర్మూర్‌ నియోజకవర్గానికి సంబంధించి ఖుద్వాన్‌పూర్‌లో, బోధన్‌ నియోజకవర్గానికి సంబంధించి ఎడపల్లిలో పాఠశాలలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గానికి సంబంధించి బాలికల పాఠశాలను చీమన్‌పల్లిలో ఏర్పాటుకు నిర్ణయించగా, అనువైన వసతులు లేని కారణంగా ప్రస్తుతం నిజామాబాద్‌లోని ఒక అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ గురుకులకు కంజరలో సొంతభవనం నిర్మిస్తుండగా ప్రస్తుతం నగరంలోని అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. 

వసతులు కరువు..
బీసీ గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు లేకపోవడంతో వినియోగంలో లేని వసతి గృహాలు, అద్దె భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు లేకపోవడం, మూత్రశాలలు, మరుగుదొడ్లు, నీటి సౌకర్యం ఆశించిన మేర లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రతి పాఠశాలలో ఐదు, ఆరు, ఏడు తరగతులలో విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారు. ఒక్కో తరగతికి రెండు సెక్షన్‌లను కేటాయించగా, ఒక్కో తరగతిలో 80 సీట్లను భర్తీ చేశారు. అంటే ఒక గురుకుల పాఠశాలలో మూడు తరగతులకు కలిపి 240 సీట్లను భర్తీ చేశారు.  
మోర్తాడ్‌లోని పాఠశాలకు వినియోగంలో లేని బీసీ విద్యార్థి వసతి గృహాన్ని కేటాయించారు. అయితే ఈ వసతిగృహంలో వందమంది విద్యార్థులు ఉండడానికి మాత్రమే వీలుంది. కానీ 240 మంది విద్యార్థులను ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆరు గదుల్లోనే వసతితో పాటు, తరగతులు నిర్వహిస్తున్నారు. అంతేగాకుండా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు, నీటివసతి సరిపోక విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు.  
ఖుద్వాన్‌పూర్‌ పాఠశాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ వసతికి ఇబ్బంది ఉన్నా.. వసతి గృహం ఎదురుగా ఉన్న ఉన్నత పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు.  
ఎడపల్లి పాఠశాలలో విద్యార్థులు ఉండలేక ఇంటిముఖం పడుతున్నారు. దీంతో వచ్చే విద్యా సంవత్సరం ఈ పాఠశాలను బోధన్‌కు తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  
నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గానికి సంబంధించి పాఠశాలను చీమన్‌పల్లికి తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చీమన్‌పల్లిలోని ఒక ప్రైవేటు భవనాన్ని అద్దెకు తీసుకుని విద్యార్థినులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. చీమన్‌పల్లిలో గురుకుల పాఠశాల నిర్వహణ కోసం రూ.30 లక్షల వరకు ఖర్చు చేసి సౌకర్యాలను మెరుగుపరిచారు. ఒక్క చీమన్‌పల్లి పాఠశాలకు సంబంధించి సమస్య పరిష్కారం అయినా మిగిలిన పాఠశాల పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది.

పెరుగనున్న విద్యార్థుల సంఖ్య..
ఈ విద్యా సంవత్సరానికి గాను ఒక్కో పాఠశాలలో 240 మంది విద్యార్థులు ఉండగా, వచ్చే ఏడాది మరో తరగతి పెరుగనుంది. ఇప్పుడు ఏడో తరగతిలో ఉన్న విద్యార్థులు వచ్చే సంవత్సరం ఎనిమిదో తరగతిలో చేరనున్నారు. అలాగే మిగిలిన రెండు తరగతుల విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్‌ కానున్నారు. దీంతో ఐదో తరగతిలో కొత్తగా విద్యార్థులు చేరడానికి అవకాశం ఉంది. అంటే మరో 80 మంది విద్యార్థుల సంఖ్య పెరగనుంది. ఇప్పుడు 240 మంది విద్యార్థులకు వసతి కల్పించడానికి ఇబ్బందులు ఉండగా విద్యార్థుల సంఖ్య మరింత పెరిగితే కష్టాలు తప్పేలా లేవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

క్రీడలకూ దూరం..
బీసీ గురుకుల పాఠశాలల విద్యార్థులు క్రీడలకూ దూరమవుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పాఠశాలల్లో అనువైన క్రీడా స్థలం లేకపోవడంతో ఆటలకు సమయం కేటాయించలేకపోతున్నారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యం. క్రీడాకారులు తయారు కావడానికి పాఠశాలల్లోనే పునాదులు ఏర్పడతాయి. అయితే గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల పరిస్థితి భిన్నంగా తయారైంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గురుకుల పాఠశాలలకు స్థల సేకరణ పూర్తి చేసి సొంత భవనాల నిర్మాణం వేగంగా చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇబ్బందులు తొలగించడానికి కృషి చేస్తున్నాం..
బీసీ గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. కొత్తగా ప్రారంభించిన పాఠశాలలకు అనువైన భవనాలు దొరకడం కష్టమే. సొంత భవనాలు నిర్మించే వరకు కొంత ఇబ్బంది తప్పదు. అయితే ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో విద్యార్థులకు సౌకర్యాలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాం. – గోపిచంద్, బీసీ గురుకుల పాఠశాలల కన్వీనర్‌

సరైన సౌకర్యాలు లేవు..
గురుకుల పాఠశాలలో సరైన వసతి కల్పించడం లేదు. నీటి సమస్య తీవ్రంగా ఉంది. అలాగే మరుగుదొడ్లు, మూత్రశాలల సంఖ్య తక్కువగా ఉంది. చదువుకోవడం, నిద్రపోవడం ఒక్కటే చోట కావడం, సామగ్రి కూడా గదుల్లోనే ఉంచడంతో ఇబ్బందిగా ఉంది. – విజయ్‌కుమార్, విద్యార్థి, మోర్తాడ్‌

కొత్త భవనాలను నిర్మించాలి
బీసీ గురుకుల పాఠశాలలకు కొత్త భవనాలను వెంటనే నిర్మించాలి. స్థలం లేక ఎలాంటి ఆటలు ఆడలేకపోతున్నాం. ప్రభుత్వం స్థల సేకరణ చేసి కొత్త భవనాలను నిర్మిస్తేనే మాకు ప్రయోజనం కలుగుతుంది.  ఇరుకు గదుల్లో చదవాలంటే ఇబ్బందిగా ఉంటోంది.   – అచ్యుత్, విద్యార్థి, మోర్తాడ్‌

మరిన్ని వార్తలు